transco cmd
-
‘కేసీఆర్ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ సీఎండీలుగా నియమిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం వారిని తొలగించి పదవీ విరమణ చేసిన వారిని సీఎండీలుగా చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసుకుంటున్న అడ్డగోలు ఒప్పందాలపై ఐఏఎస్‌లు సంతకాలు పెట్టకపోవడంతోనే వారిని తొలగించి రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావు, గోపాలరావు లాంటి వారిని సీఎండీలుగా నియమించారని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలు 74 వేల కోట్లు అప్పులు తెస్తే.. కేవలం 35 కోట్లు మాత్రమే తెచ్చామని సీఎండీ ప్రభాకర్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావు దీనిపై వివరాలు బయటపెట్టాలని రేవంత్ సవాల్ చేశారు. ప్రభాకర్ రావు ఏదో నీతిమంతుడు అయినట్లు కొంతమంది చెంచాలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దోపిడియే లేకుంటే ప్రభుత్వం ఆధీనంలోని సంస్థల విద్యుత్ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతోందని నిలదీస్తే.. ఉద్యోగులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్ రావును విద్యుత్ సంస్థల సీఎండీగా నియమించడానికి అర్హతే లేదన్నారు. అర్హత లేని ప్రభాకర్ రావు కింద పని చేయలేక సమర్థవంతమైన ఐఏఎస్‌లు బదిలీలు చేయించుకొని వెళ్లిపోతున్నారన్నారు. కరెన్సీ కట్టల కోసం కేసీఆర్ విద్యుత్ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు మీద నిషేధం విధించినప్పుడు మాట్లాడని సంఘాల నేతలు నిన్న ఎందుకు రోడెక్కి ధర్నాలు చేశారని ప్రశ్నించారు. చెన్నూరులో ఒక అధికారి కేసీఆర్, కేటీఆర్ మీద మాట్లాడితే చర్యలు తీసుకున్నారు.. మరి నా గురించి ఇంత మంది ఉద్యోగులు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను మొక్కలు అని ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని, ఏ తేదిలోపు చేయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేసీఆర్‌కు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయిందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఆపార్టీలో స్థానం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. -
7,966 లైన్మెన్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 7,966 మంది జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పోస్టులకు ఆగస్టు 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 682 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గ్రామ సచివాలయాల్లో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 1,241 పోస్టులున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు ఉండీ ఈ ఏడాది జులై 1నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మేన్ ట్రేడ్ కోర్సుతో పాటు పదో తరగతి వారు అర్హులు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు కూడా అర్హులే. రిజర్వేషన్లు, ఇతర వివరాలను ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొదటి 20 శాతం పోస్టులను ఓపెన్ క్యాటగిరీలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80 శాతం పోస్టులను లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ సర్కిల్(జిల్లా) పరిధిలోని వారు ఆ సర్కిల్(జిల్లా)లో పోస్టులకు లోకల్ అభ్యర్థులు అవుతారు. ఓ అభ్యర్థి గరిష్టంగా మూడు సర్కిళ్లలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పారదర్శకంగా పోస్టుల భర్తీ లైన్మెన్ పోస్టులను నిబంధనల మేరకు పారదర్శకంగా భర్తీ చేస్తాం. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం. అక్టోబరు 2 నాటికి లైన్మెన్ విధుల్లో చేరుతారు. – ఎన్.శ్రీకాంత్, ట్రాన్స్‌కో సీఎండీ లైన్మెన్ పోస్టులకు www. apeasternpower. com, www. apspdcl. in, http:// gramasachivalayam. ap. gov. in, http://59.144.184.105/ jlm19 వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతమున్న పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
విద్యుత్‌పై మేధోమథనం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలు పనిచేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించామని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు పునరంకితం కావాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులైన ప్రభాకర్‌రావు నేతృత్వంలో జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు శనివారం ఇక్కడ సమావేశమై మేధోమథనం జరిపారు. ‘తెలంగాణ విద్యుత్ రంగానికి పునరంకితం’అన్న ప్రధాన ఎజెండాతో జరిగిన ఈ భేటీలో 24 గంటల విద్యుత్ సరఫరా, ఆదాయం పెంపు, నష్టాల తగ్గింపు తదితర కీలక అంశాలపై చర్చించారు. వచ్చే రబీ సీజన్లో గరిష్ట డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. లోటుపాట్లు సవరించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ల నిర్మాణం పురోగతిపై చర్చించారు. వచ్చే నెల 2,3 తేదీలలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన ధర్మాధికారి కమిటీ సమావేశం ఉన్నందున ఈ విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేశారు. ఈ ఏడాది వర్షాకాలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి పంపింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, విద్యుత్ సరఫరా వ్యవస్థ సర్వసన్నధ్ధం కావాలని నిర్ణయించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఇతర రంగాలకు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నందున గరిష్ట డిమాండ్ వచ్చే అవకాశం వుంది. ఈ డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు అనుసరించాల్సిన వ్యూçహాన్ని సమావేశంలో ఖరారు చేశారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించినందున, వారి సర్వీసు నిబంధనలను చర్చించి ఖరారు చేశారు. ‘రైతులకు 24 గంటల పాటు కరెంట్ అందించాలి. ఈసారి ఎత్తిపోతల పథకాలకు కూడా ఎక్కువ కరెంట్ అవసరమవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలు సరైన ప్రణాళికలు వేసుకుని ముందుకు పోవాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలు సాధించాయి. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు పునరంకితం కావాలి’’అని ప్రభాకర్‌రావు ప్రారంభోపన్యాసంలో చెప్పారు. ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.గోపాలరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ట్రాన్స్‌కో సీఎండీకి ఘన సన్మానం విద్యుత్ రంగంలో యాభై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును విద్యుత్ సంస్థల డైరెక్టర్లు శనివారం ఘనంగా సన్మానించారు. తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్న డైరెక్టర్లు..ప్రభాకర్ రావు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. -
ఇంజనీర్లా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఆశలపై తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు చల్లింది. కోచింగ్ సెంటర్లలో చేరి, వేలాది రూపాయలు వెచ్చిస్తూ శిక్షణ పొందుతున్న వారికి గట్టి షాక్ ఇచ్చింది. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2,000 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అంతగా అవసరమైతే ఔట్సోర్సింగ్ విధానం కింద సిబ్బందిని నియమించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీకి ఓ లేఖ రాశారు. ప్రస్తుతం బయటి మార్కెట్లో ఉన్న వేతనాల కంటే ఇంజనీర్లకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వేతనాలపై సమీక్ష జరిగి, ఓ నిర్ణయం తీసుకునే వరకూ విద్యుత్ సంస్థల్లో పోస్టుల భర్తీకి అనుమతించే ప్రసక్తే లేదని అందులో స్పష్టం చేశారు. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖలకూ ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నారట! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో దాదాపు 650 ఇంజనీరింగ్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణి సంస్థలు ప్రతిఏటా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 27న, ఈ ఏడాది మే 28న, అక్టోబర్ 1న ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ ఇదే విషయాన్ని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు(ఏఈ) నిబంధనల ప్రకారం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లుగా(ఏడీఈ) పదోన్నతి కల్పించారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న 650 ఏఈ పోస్టులతోపాటు పదోన్నతులతో ఏర్పడ్డ ఖాళీలను కలిపితే దాదాపు 2,000 ఏఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తిరస్కరించారు. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ట్రాన్స్‌కో సీఎండీకి ఓ లేఖ రాశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లకు ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నట్టు ప్రభుత్వ భావిస్తోందని తెలిపారు. వేతనాలపై సమీక్ష జరిగి, ఓ నిర్ణయం తీసుకునే దాకా కొత్త ఉద్యోగ నియామకాలకు అనుమతించేది లేదని లేఖలో తేల్చిచెప్పారు. అంతగా అవసరమైతే ఔట్సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. కొత్త కొలువులు తూచ్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించి, భారీ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబు అధికారంలోకి వచ్చినా జాబు మాత్రం రాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు నాలుగున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో చేరి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కనీసం ఎన్నికల ముందైనా నోటిఫికేషన్లు వెలువడుతాయని భావిస్తుండగా, ప్రభుత్వం తూచ్ అని తేల్చేయడం గమనార్హం. బయటి మార్కెట్లో జీతాలు ఎక్కువే ఇంజనీర్లకు బయటి మార్కెట్లో కంటే తాము ఎక్కువ జీతాలు ఇస్తున్నామని టీడీపీ ప్రభుత్వం చెబుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. సేవా రంగంలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకం. నిజానికి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్ల కంటే కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి అధిక వేతనాలు లభిస్తున్నాయి. 2018లో హైదరాబాద్‌లో ఇప్పటివరకు 50,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కాయి. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు మెరుగైన వేతన ప్యాకేజీలతో వారిని కొలువుల్లో చేర్చుకున్నాయి. కంప్యూటర్ అసోసియేట్స్ అనే సంస్థ ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. అంటే ఒక్కోఉద్యోగికి నెలకు రూ.60 వేలకు పైగానే వేతనం ఇస్తున్నట్లు లెక్క. ఒరాకిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని లాంటి సంస్థలతోపాటు స్టార్టప్ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి, ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొత్త కొలువులు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. వారికి ప్రస్తుతం ఇస్తున్న అరకొర జీతాలే చాలా ఎక్కువని భావిస్తోంది. అసలు ఇంజనీర్లే అవసరం లేదన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ముఖం ఎలా చూపించాలి? ‘‘విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టులను భర్తీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకున్నా. కోచింగ్‌కు రూ.60 వేలు, ప్రతినెలా ఖర్చులు రూ.10 వేల చొప్పున అయ్యాయి. అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే 740 ఏఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో అసలు ఉద్యోగాల భర్తీయే లేదంటున్నారు. ఇక మేము తల్లిదండ్రులకు ముఖం చూపించేదెలా? తలచుకుంటేనే ఏడుపొస్తోంది’’ – కిషోర్, ఎంటెక్ విద్యార్థి, విజయనగరం జిల్లా మాలాంటి వారికి తీరని అన్యాయం ‘‘ఇంజనీర్లకు వేతనాలు ఇవ్వడం దండగని ప్రభుత్వం భావించడం దారుణం. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోంది. విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఔట్సోర్సింగ్ పేరుతో పోస్టులను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. మాలాంటి వారికి తీరని అన్యాయం చేస్తున్నారు’’ – సాయి, బీటెక్ విద్యార్థి, తూర్పుగోదావరి జిల్లా మా పొట్టగొట్టే ఆలోచన మానుకోవాలి ‘‘మేం కష్టపడి ఇంజనీరింగ్ చదువుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నాం. మెరిట్ ప్రకారం మాకు ఉద్యోగాలిస్తే నాణ్యమైన సేవలందిస్తాం. కేవలం డిప్లొమా చేసిన వాళ్లను రాజకీయ నాయకుల అండదండలతో ఔట్సోర్సింగ్ విధానం కింద నియమిస్తున్నారు. పోస్టులను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం మా పొట్టగొట్టే ఆలోచన మానుకోవాలి’’ – శివాజీ, బిటెక్ గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం జిల్లా -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు ఓకే!
♦ తాత్కాలిక ధరతో కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ♦ ఒప్పందంలో పలు సవరణలు, మార్పులకు ఆదేశం ♦ తక్కువ ధరకే విద్యుత్ వస్తుందన్న ట్రాన్స్‌కో సీఎండీ ♦ మరిన్ని సవరణలు చేయాలంటున్న విద్యుత్ రంగ నిపుణులు ♦ ప్లాంటు వ్యయంతో స్థిర చార్జీలు పెరిగే అవకాశముందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను తాత్కాలిక ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) అనుమతించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి (సీఎస్ఈఆర్సీ) ఖరారు చేసిన తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90కు ఓకే చెప్పింది. అయితే రాష్ట్ర విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ డిస్కం)ల ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో పలు ముఖ్యమైన మార్పులు, సవరణలు చేయాలని ఆదేశించింది. కొన్ని నిబంధనలను తొలగించాలని స్పష్టం చేస్తూ.. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల సూచనల మేరకు.. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్ డిస్కం)తో తెలంగాణ టీఎస్ డిస్కమ్‌లు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2015 సెప్టెంబర్ 22న జరిగిన ఈ ఒప్పందంలో 12 ఏళ్ల కాలపరిమితి విధించారు. అయితే ఈ ఒప్పందంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణులు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. టీఎస్ఈఆర్సీ వాటిని పరిగణనలోకి తీసుకుని ఒప్పందానికి సవరణలు చేయాలని ఆదేశించింది. సవరణల తర్వాత తుది ఆమోదం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధర నిర్ణయం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఉందని టీఎస్ ఈఆర్సీ తేల్చింది. ఒప్పందంలో తాము సూచించిన సవరణలు చేసి, విద్యుత్ తుది ధర ఖరారు కోసం ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ముందు ఉంచాలని సూచించింది. అక్కడ ఖరారైన తుది ధరను ఒప్పందంలో పొందుపరిచి తమ నుంచి తుది ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని రెండు డిస్కంల మధ్య ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపకాలపైనా స్పష్టత ఇచ్చింది. ఇక ట్రేడింగ్ మార్జిన్ మినహాయింపునకు ఛత్తీస్‌గఢ్ డిస్కం అంగీకరించింది. విద్యుత్ డెలివరీ పాయింట్‌ను ఛత్తీస్‌గఢ్ జనరేటర్ వద్ద కాకుండా ఆ రాష్ట్ర ట్రాన్స్‌కో సరిహద్దు దగ్గర లెక్కించేందుకూ ఒప్పుకొంది. రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించిన సవరణల్లో ప్రధాన అంశాలు ⇔ వార్ధా–డిచ్పల్లి ట్రాన్స్మిషన్ కారిడార్ లభ్యత ఆధారంగా విద్యుత్ స్థిర చార్జీలు చెల్లించాలి. ⇔ ఒప్పంద కాలపరిమితిపై పూర్తి స్పష్టత కల్పించాలి. ⇔ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తి లభ్యతకు సంబంధించిన నిర్వచనం లోనూ మార్పు చేయాలి. ⇔ క్యాప్టివ్ కోల్ మైన్ నుంచి కాకుండా బయటి గనుల నుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తే తెలంగాణ డిస్కంల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ⇔ విద్యుత్ తాత్కాలిక ధర, వాస్తవ ధర మధ్య వ్యత్యాసం ఉంటే ఏవిధంగా చెల్లించాలన్న దానిపై ఒప్పందంలో స్పష్టత రావాలి. ⇔ తుది ధర నిర్ణయం కోసం ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలో తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పాల్గొని.. ఇక్కడి వినియోగదారుల మీద భారం పడకుండా వాదనలు వినిపిం చాలి. ప్రధానంగా మార్వా థర్మల్ ప్లాంట్ పెట్టుబడి వ్యయంపై చర్చించాలి. అధిక వడ్డీ గల పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీ రుణాలతో మార్పిడి చేసుకునే అంశంపై వాదన వినిపించాలి. ఆ విద్యుత్ అధిక ధరేం కాదు ‘‘అందరూ ఊహించినట్లు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అధిక ధర కాదు. రాష్ట్ర జెన్కో విద్యుత్‌తో పోల్చినా ఎక్కువేం కాదు. తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90 లాగానే.. తుది ధర కూడా ఉంటుంది. టీఎస్ ఈఆర్సీ సూచించిన విధంగా ఒప్పందంలో మార్పులు చేస్తాం. వార్ధా–డిచ్పల్లి కారిడార్ ద్వారా వారం రోజుల్లో రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ప్రారంభమ వుతుంది..’’ – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మరిన్ని సవరణలు అవసరం ‘‘ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ రూ.3.90 తాత్కాలిక విద్యుత్ ధరను 2016లో నిర్ణయించింది. అందులో స్థిర వ్యయం రూ.2.70, చర వ్యయం రూ.1.20గా ఉంది. విద్యుత్ ప్లాంట్‌పై అప్పటి పెట్టుబడి వ్యయం ఒక్కో మెగావాట్ సామర్థ్యానికి రూ.7.2 కోట్లుగా పరిగణనలోకి తీసుకుని విద్యుత్ ధరను నిర్ణయించారు. ఇప్పుడు ప్లాంట్ వ్యయం ఒక్కో మెగావాట్ సామర్థ్యానికి రూ.9 కోట్లు దాటింది. దీంతో స్థిర వ్యయం భారీగా పెరిగే అవకాశముంది. ప్లాంట్ వ్యయాన్ని ఆమోదించే విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకునే లా తెలంగాణ ఈఆర్సీ ఆదేశించాలి. ఇక ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ జారీ చేసిన 2017–18 టారిఫ్ ఉత్తర్వుల్లో అక్కడి ప్లాంట్లకు అందే బొగ్గు ధర భారీగా పెరిగినట్లు పేర్కొంది. అంటే బొగ్గు ధర పెరిగితే చర వ్యయం కూడా పెరుగుతుంది. ప్లాంటుకు కేటాయించిన బొగ్గు గని (కాప్టివ్ మైన్) నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి కొన్నేళ్లు పట్టవచ్చు. మార్కెట్ నుంచి బొగ్గు కొనుగో లుకు డిస్కంలు ఒప్పుకోని పక్షంలో ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించే స్థిర వ్యయాన్ని కాప్టివ్ బొగ్గు ఉత్పత్తి మేరకే పరిమితం చేస్తే రాష్ట్రంపై భారం పడదు..’’ – కె.రఘు, విద్యుత్ రంగ నిపుణుడు -
మీ నిర్లక్ష్యంతో.. శాఖకు చెడ్డపేరు
నిజామాబాద్ నాగారం : విద్యుత్‌శాఖలో అధికారులు నిర్లక్ష్యం వల్ల.. ఉద్యోగులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు... ఏ ఒక్కరు కూడా సక్రమంగా పనులు చేయడం లేదని... శాఖకు చెడ్డపేరు వస్తుందని... విద్యుత్‌శాఖ ఎస్ఈ ప్రభాకర్ అలసత్వంపై టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విద్యుత్‌శాఖ పవర్‌హౌజ్‌లో విద్యుత్అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ అధికారులు ఎవరు బాధ్యతయుతంగా విధులు నిర్వహించడం లేదన్నారు. స్థానికంగా హెడ్‌క్వాటర్స్‌లో ఉండమని చెప్పని ఎవ్వరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఈ ప్రభాకర్ అలసత్వంగా వ్యవహారించడంపై సీఎండీ ఫైర్ అయ్యాడు. జిల్లా కలెక్షన్లో బాగా వెనుకబడిందన్నారు. పనులు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. తీసుకుంటున్న జీతాలను న్యాయం చేయకపోతే ఎలా ప్రశ్నించారు. స్టోర్‌లో కోట్లాది రూపాయలు విలువ చేసే పరికారాలు ఉన్నాయని, 40కేవీ ట్రాన్సుఫార్మర్లు 6నెలల నుంచి అలాగే ఉన్నాయన్నారు. చాలా ప్రాంతాల్లో 25కేవీ, 16కేవీ ట్రాన్సుఫార్మర్లు చెడిపోతున్నాయని అన్నారు. బడ్జెట్‌కు కోదువ లేదని, పనులు చేయకుండా కాలక్షేపం చేయడంపై మండిపడ్డారు. ఇక నుంచి సహించేది లేదని విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని సస్పెండ్ చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్రావు డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర అధికారులు తదితరులు పాల్గోన్నారు. -
విద్యుత్‌శాఖలో బదిలీల పర్వం
- 300 మందికి స్థాన చలనం - ఒకేచోట మూడేళ్ల సర్వీస్ దాటిన వారికి తప్పని బదిలీ - 15 తేదీలోగా పూర్తిచేయాలని ఉత్తర్వులు - 11 వ తేదీన సీనియారిటీ జాబితా నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖలో బదిలీల పర్వ మొదలైంది. ఈ నెల 15 తేదీలోగా ఉద్యోగులు, అధికారుల బదిలీలు పూర్తిచేయాలని ట్రాన్స్‌కో సీఎండీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి బదిలీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితా సోమవారం(11వ తేదీ) ప్రకటిస్తారు. బదిలీ అయిన ఉద్యోగులు ఈ నెల 22 తేదీలోగా తమ ప్రాంతాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. కదలనున్న పీఠాలు.. జిల్లాలో ఒకేచోట కదలకుండా పదేళ్లపాటు పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు అనేక మంది ఉన్నారు. ఈ బదిలీ పుణ్యమాని సుమారు 300 మందికి స్థానం చలనం కలగుతుంది. అసిస్టెంట్ లైన్మెన్ స్థాయి నుంచి ఏడీ, డీఈల వరకు బదిలీ కానున్నారు. లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు సబ్డివిజన్ల పరిధిలోనే బదిలీలు చేపడతారు. ఏఈలు, ఏడీలు, అకౌంట్స్ విభాగం, ఎల్డీసీ, జేఏఓలను సర్కిల్ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. బదిలీ అయ్యే వారిలో ట్రాన్స్ఫార్మర్ డీఈ, ఏడీలు 16 మంది ఉన్నారు. మిర్యాలగూడ, హాలియా ఏడీల సర్వీసు మూడేళ్లు పూర్తికాలేదు. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. సబ్స్టేషన్ల నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు పంపాలి : ట్రాన్స్‌కో డెరైక్టర్ జిల్లాలో లోఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త సబ్స్టేషన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని ట్రాన్స్‌కో డెరైక్టర్ శ్రీనివాస్ జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం విద్యుత్ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో భాగంగా ఉద్యోగుల బదిలీలు, మున్సిపాల్టీల్లో జరుగుతున్న విద్యుత్ ఆధునికీకరణ పనుల గురించి ఆయన సమీక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో చేపడుతున్న విద్యుత్ ఆధునికీకరణ పనులు జూన్‌లోగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని సూచించారు. నెలవారీ బిల్లులు వందశాతం వసూలు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లు చెడిపోకుండా లైన్లను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ భిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో సీఎండీగా ప్రభాకర్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా డి.ప్రభాకర్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ట్రాన్స్‌కో సీఎండీగా కొనసాగుతున్న ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.కె.జోషీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ప్రభాకర్‌రావును నియమించింది. ప్రస్తుతం ప్రభాకర్‌రావు టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు.