ఇంజనీర్లా.. వద్దే వద్దు | Unemployed Engineering Graduates angry on the Chandrababu regime | Sakshi
Sakshi News home page

ఇంజనీర్లా.. వద్దే వద్దు

Published Mon, Dec 10 2018 3:39 AM | Last Updated on Mon, Dec 10 2018 4:29 AM

Unemployed Engineering Graduates angry on the Chandrababu regime - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల ఆశలపై తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు చల్లింది. కోచింగ్‌ సెంటర్లలో చేరి, వేలాది రూపాయలు వెచ్చిస్తూ శిక్షణ పొందుతున్న వారికి గట్టి షాక్‌ ఇచ్చింది. విద్యుత్‌ సంస్థల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2,000 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అంతగా అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ విధానం కింద సిబ్బందిని నియమించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీకి ఓ లేఖ రాశారు. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో ఉన్న వేతనాల కంటే ఇంజనీర్లకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వేతనాలపై సమీక్ష జరిగి, ఓ నిర్ణయం తీసుకునే వరకూ విద్యుత్‌ సంస్థల్లో పోస్టుల భర్తీకి అనుమతించే ప్రసక్తే లేదని అందులో స్పష్టం చేశారు. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖలకూ ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.  

ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నారట! 
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థల్లో దాదాపు 650 ఇంజనీరింగ్‌ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, విద్యుత్‌ పంపిణి సంస్థలు ప్రతిఏటా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ 27న, ఈ ఏడాది మే 28న, అక్టోబర్‌ 1న ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ ఇదే విషయాన్ని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న అసిస్టెంట్‌ ఇంజనీర్లకు(ఏఈ) నిబంధనల ప్రకారం అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లుగా(ఏడీఈ) పదోన్నతి కల్పించారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న 650 ఏఈ పోస్టులతోపాటు పదోన్నతులతో ఏర్పడ్డ ఖాళీలను కలిపితే దాదాపు 2,000 ఏఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తిరస్కరించారు. ఈ మేరకు అక్టోబర్‌ 31వ తేదీన ట్రాన్స్‌కో సీఎండీకి ఓ లేఖ రాశారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లకు ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నట్టు ప్రభుత్వ భావిస్తోందని తెలిపారు. వేతనాలపై సమీక్ష జరిగి, ఓ నిర్ణయం తీసుకునే దాకా కొత్త ఉద్యోగ నియామకాలకు అనుమతించేది లేదని లేఖలో తేల్చిచెప్పారు. అంతగా అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.  

కొత్త కొలువులు తూచ్‌ 
ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించి, భారీ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబు అధికారంలోకి వచ్చినా జాబు మాత్రం రాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు నాలుగున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లలో చేరి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కనీసం ఎన్నికల ముందైనా నోటిఫికేషన్లు వెలువడుతాయని భావిస్తుండగా, ప్రభుత్వం తూచ్‌ అని తేల్చేయడం గమనార్హం. 

బయటి మార్కెట్‌లో జీతాలు ఎక్కువే 
ఇంజనీర్లకు బయటి మార్కెట్‌లో కంటే తాము ఎక్కువ జీతాలు ఇస్తున్నామని టీడీపీ ప్రభుత్వం చెబుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. సేవా రంగంలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకం. నిజానికి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్ల కంటే కార్పొరేట్‌ రంగంలో పనిచేసే వారికి అధిక వేతనాలు లభిస్తున్నాయి. 2018లో హైదరాబాద్‌లో ఇప్పటివరకు 50,000 మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కాయి. ప్రైవేట్, కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన వేతన ప్యాకేజీలతో వారిని కొలువుల్లో చేర్చుకున్నాయి. కంప్యూటర్‌ అసోసియేట్స్‌ అనే సంస్థ ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. అంటే ఒక్కోఉద్యోగికి నెలకు రూ.60 వేలకు పైగానే వేతనం ఇస్తున్నట్లు లెక్క. ఒరాకిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని లాంటి సంస్థలతోపాటు స్టార్టప్‌ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి, ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు కొత్త కొలువులు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. వారికి ప్రస్తుతం ఇస్తున్న అరకొర జీతాలే చాలా ఎక్కువని భావిస్తోంది. అసలు ఇంజనీర్లే అవసరం లేదన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తల్లిదండ్రులకు ముఖం ఎలా చూపించాలి? 
‘‘విద్యుత్‌ సంస్థల్లో ఏఈ పోస్టులను భర్తీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో హైదరాబాద్‌ వెళ్లి కోచింగ్‌ తీసుకున్నా. కోచింగ్‌కు రూ.60 వేలు, ప్రతినెలా ఖర్చులు రూ.10 వేల చొప్పున అయ్యాయి. అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే 740 ఏఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో అసలు ఉద్యోగాల భర్తీయే లేదంటున్నారు. ఇక మేము తల్లిదండ్రులకు ముఖం చూపించేదెలా? తలచుకుంటేనే ఏడుపొస్తోంది’’ 
– కిషోర్, ఎంటెక్‌ విద్యార్థి, విజయనగరం జిల్లా 

మాలాంటి వారికి తీరని అన్యాయం 
‘‘ఇంజనీర్లకు వేతనాలు ఇవ్వడం దండగని ప్రభుత్వం భావించడం దారుణం. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోంది. విద్యుత్‌ సంస్థల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పోస్టులను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. మాలాంటి వారికి తీరని అన్యాయం చేస్తున్నారు’’ 
– సాయి, బీటెక్‌ విద్యార్థి, తూర్పుగోదావరి జిల్లా  

మా పొట్టగొట్టే ఆలోచన మానుకోవాలి
‘‘మేం కష్టపడి ఇంజనీరింగ్‌ చదువుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా కోచింగ్‌ తీసుకుంటున్నాం. మెరిట్‌ ప్రకారం మాకు ఉద్యోగాలిస్తే నాణ్యమైన సేవలందిస్తాం. కేవలం డిప్లొమా చేసిన వాళ్లను రాజకీయ నాయకుల అండదండలతో ఔట్‌సోర్సింగ్‌ విధానం కింద నియమిస్తున్నారు. పోస్టులను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం మా పొట్టగొట్టే ఆలోచన మానుకోవాలి’’ 
– శివాజీ, బిటెక్‌ గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement