ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు ఓకే! | chhattisgarh power supply to telangana | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు ఓకే!

Published Fri, Apr 7 2017 12:56 AM | Last Updated on Tue, May 29 2018 11:18 AM

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు ఓకే! - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు ఓకే!

తాత్కాలిక ధరతో కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి
ఒప్పందంలో పలు సవరణలు, మార్పులకు ఆదేశం
తక్కువ ధరకే విద్యుత్‌ వస్తుందన్న ట్రాన్స్‌కో సీఎండీ
మరిన్ని సవరణలు చేయాలంటున్న విద్యుత్‌ రంగ నిపుణులు
ప్లాంటు వ్యయంతో స్థిర చార్జీలు పెరిగే అవకాశముందని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ను తాత్కాలిక ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) అనుమతించింది. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఎస్‌ఈఆర్సీ) ఖరారు చేసిన తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90కు ఓకే చెప్పింది. అయితే రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులు, విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ డిస్కం)ల ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో పలు ముఖ్యమైన మార్పులు, సవరణలు చేయాలని ఆదేశించింది. కొన్ని నిబంధనలను తొలగించాలని స్పష్టం చేస్తూ.. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిపుణుల సూచనల మేరకు..
ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు కోసం ఆ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీఎస్‌ డిస్కం)తో తెలంగాణ టీఎస్‌ డిస్కమ్‌లు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2015 సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ ఒప్పందంలో 12 ఏళ్ల కాలపరిమితి విధించారు. అయితే ఈ ఒప్పందంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణలో విద్యుత్‌ రంగ నిపుణులు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. టీఎస్‌ఈఆర్సీ వాటిని పరిగణనలోకి తీసుకుని ఒప్పందానికి సవరణలు చేయాలని ఆదేశించింది.

సవరణల తర్వాత తుది ఆమోదం
ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ధర నిర్ణయం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఉందని టీఎస్‌ ఈఆర్సీ తేల్చింది. ఒప్పందంలో తాము సూచించిన సవరణలు చేసి, విద్యుత్‌ తుది ధర ఖరారు కోసం ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ముందు ఉంచాలని సూచించింది. అక్కడ ఖరారైన తుది ధరను ఒప్పందంలో పొందుపరిచి తమ నుంచి తుది ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని రెండు డిస్కంల మధ్య ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ పంపకాలపైనా స్పష్టత ఇచ్చింది. ఇక ట్రేడింగ్‌ మార్జిన్‌ మినహాయింపునకు ఛత్తీస్‌గఢ్‌ డిస్కం అంగీకరించింది. విద్యుత్‌ డెలివరీ పాయింట్‌ను ఛత్తీస్‌గఢ్‌ జనరేటర్‌ వద్ద కాకుండా ఆ రాష్ట్ర ట్రాన్స్‌కో సరిహద్దు దగ్గర లెక్కించేందుకూ ఒప్పుకొంది.

రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించిన సవరణల్లో ప్రధాన అంశాలు
వార్ధా–డిచ్‌పల్లి ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌ లభ్యత ఆధారంగా విద్యుత్‌ స్థిర చార్జీలు చెల్లించాలి.

ఒప్పంద కాలపరిమితిపై పూర్తి స్పష్టత కల్పించాలి.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి లభ్యతకు సంబంధించిన నిర్వచనం లోనూ మార్పు చేయాలి.

క్యాప్టివ్‌ కోల్‌ మైన్‌ నుంచి కాకుండా బయటి గనుల నుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తే తెలంగాణ డిస్కంల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

విద్యుత్‌ తాత్కాలిక ధర, వాస్తవ ధర మధ్య వ్యత్యాసం ఉంటే ఏవిధంగా చెల్లించాలన్న దానిపై ఒప్పందంలో స్పష్టత రావాలి.

తుది ధర నిర్ణయం కోసం ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలో తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పాల్గొని.. ఇక్కడి వినియోగదారుల మీద భారం పడకుండా వాదనలు వినిపిం చాలి. ప్రధానంగా మార్వా థర్మల్‌ ప్లాంట్‌ పెట్టుబడి వ్యయంపై చర్చించాలి. అధిక వడ్డీ గల పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీ రుణాలతో మార్పిడి చేసుకునే అంశంపై వాదన వినిపించాలి.

ఆ విద్యుత్‌ అధిక ధరేం కాదు
‘‘అందరూ ఊహించినట్లు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ అధిక ధర కాదు. రాష్ట్ర జెన్‌కో విద్యుత్‌తో పోల్చినా ఎక్కువేం కాదు. తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90 లాగానే.. తుది ధర కూడా ఉంటుంది. టీఎస్‌ ఈఆర్సీ సూచించిన విధంగా ఒప్పందంలో మార్పులు చేస్తాం. వార్ధా–డిచ్‌పల్లి కారిడార్‌ ద్వారా వారం రోజుల్లో రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సరఫరా ప్రారంభమ వుతుంది..’’    – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు

మరిన్ని సవరణలు అవసరం
‘‘ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ రూ.3.90 తాత్కాలిక విద్యుత్‌ ధరను 2016లో నిర్ణయించింది. అందులో స్థిర వ్యయం రూ.2.70, చర వ్యయం రూ.1.20గా ఉంది. విద్యుత్‌ ప్లాంట్‌పై అప్పటి పెట్టుబడి వ్యయం ఒక్కో మెగావాట్‌ సామర్థ్యానికి రూ.7.2 కోట్లుగా పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ ధరను నిర్ణయించారు. ఇప్పుడు ప్లాంట్‌ వ్యయం ఒక్కో మెగావాట్‌ సామర్థ్యానికి రూ.9 కోట్లు దాటింది. దీంతో స్థిర వ్యయం భారీగా పెరిగే అవకాశముంది. ప్లాంట్‌ వ్యయాన్ని ఆమోదించే విషయంలో కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకునే లా తెలంగాణ ఈఆర్సీ ఆదేశించాలి. ఇక ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ జారీ చేసిన 2017–18 టారిఫ్‌ ఉత్తర్వుల్లో అక్కడి ప్లాంట్లకు అందే బొగ్గు ధర భారీగా పెరిగినట్లు పేర్కొంది. అంటే బొగ్గు ధర పెరిగితే చర వ్యయం కూడా పెరుగుతుంది. ప్లాంటుకు కేటాయించిన బొగ్గు గని (కాప్టివ్‌ మైన్‌) నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి కొన్నేళ్లు పట్టవచ్చు. మార్కెట్‌ నుంచి బొగ్గు కొనుగో లుకు డిస్కంలు ఒప్పుకోని పక్షంలో ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించే స్థిర వ్యయాన్ని కాప్టివ్‌ బొగ్గు ఉత్పత్తి మేరకే పరిమితం చేస్తే రాష్ట్రంపై భారం పడదు..’’
– కె.రఘు, విద్యుత్‌ రంగ నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement