విద్యుత్‌శాఖలో బదిలీల పర్వం
- 300 మందికి స్థాన చలనం
- ఒకేచోట మూడేళ్ల సర్వీస్ దాటిన వారికి తప్పని బదిలీ
- 15 తేదీలోగా పూర్తిచేయాలని ఉత్తర్వులు
- 11 వ తేదీన సీనియారిటీ జాబితా
నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖలో బదిలీల పర్వ మొదలైంది. ఈ నెల 15 తేదీలోగా ఉద్యోగులు, అధికారుల బదిలీలు పూర్తిచేయాలని ట్రాన్స్‌కో సీఎండీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి బదిలీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితా సోమవారం(11వ తేదీ) ప్రకటిస్తారు. బదిలీ అయిన ఉద్యోగులు ఈ నెల 22 తేదీలోగా తమ ప్రాంతాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
కదలనున్న పీఠాలు..
జిల్లాలో ఒకేచోట కదలకుండా పదేళ్లపాటు పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు అనేక మంది ఉన్నారు. ఈ బదిలీ పుణ్యమాని సుమారు 300 మందికి స్థానం చలనం కలగుతుంది. అసిస్టెంట్ లైన్‌మెన్ స్థాయి నుంచి ఏడీ, డీఈల వరకు బదిలీ కానున్నారు. లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు సబ్‌డివిజన్‌ల పరిధిలోనే బదిలీలు చేపడతారు. ఏఈలు, ఏడీలు, అకౌంట్స్ విభాగం, ఎల్‌డీసీ, జేఏఓలను సర్కిల్ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. బదిలీ అయ్యే వారిలో ట్రాన్స్‌ఫార్మర్ డీఈ, ఏడీలు 16 మంది ఉన్నారు. మిర్యాలగూడ, హాలియా ఏడీల సర్వీసు మూడేళ్లు పూర్తికాలేదు. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉంది.
సబ్‌స్టేషన్ల నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు పంపాలి : ట్రాన్స్‌కో డెరైక్టర్
జిల్లాలో లోఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని ట్రాన్స్‌కో డెరైక్టర్ శ్రీనివాస్ జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం విద్యుత్ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో భాగంగా ఉద్యోగుల బదిలీలు, మున్సిపాల్టీల్లో జరుగుతున్న విద్యుత్ ఆధునికీకరణ పనుల గురించి ఆయన సమీక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో చేపడుతున్న విద్యుత్ ఆధునికీకరణ పనులు జూన్‌లోగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్‌ల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని సూచించారు. నెలవారీ బిల్లులు వందశాతం వసూలు చేయాలని, ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోకుండా లైన్లను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.