‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’ | Revanth Reddy Fires On KCR Over Power Supply In Telangana | Sakshi
Sakshi News home page

ప్రభాకర్‌ రావుకు ఆ అర్హత లేదు: రేవంత్‌

Published Sat, Aug 31 2019 2:33 PM | Last Updated on Sat, Aug 31 2019 3:16 PM

Revanth Reddy Fires On KCR Over Power Supply In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ సీఎండీలుగా నియమిస్తారని, కానీ కేసీఆర్‌ మాత్రం వారిని తొలగించి పదవీ విరమణ చేసిన వారిని సీఎండీలుగా చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసుకుంటున్న అడ్డగోలు ఒప్పందాలపై ఐఏఎస్‌లు సంతకాలు పెట్టకపోవడంతోనే వారిని తొలగించి రిటైర్‌ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభాకర్‌ రావు, గోపాలరావు లాంటి వారిని సీఎండీలుగా నియమించారని అన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్‌ సంస్థలు 74 వేల కోట్లు అప్పులు తెస్తే.. కేవలం 35 కోట్లు మాత్రమే తెచ్చామని సీఎండీ ప్రభాకర్‌ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్‌ రావు దీనిపై వివరాలు బయటపెట్టాలని రేవంత్‌ సవాల్‌ చేశారు. ప్రభాకర్‌ రావు ఏదో నీతిమంతుడు అయినట్లు కొంతమంది చెంచాలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దోపిడియే లేకుంటే ప్రభుత్వం ఆధీనంలోని సంస్థల విద్యుత్‌ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతోందని నిలదీస్తే.. ఉద్యోగులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌ రావును విద్యుత్ సంస్థల సీఎండీగా నియమించడానికి అర్హతే లేదన్నారు. అర్హత లేని ప్రభాకర్‌ రావు కింద పని చేయలేక సమర్థవంతమైన ఐఏఎస్‌లు బదిలీలు చేయించుకొని వెళ్లిపోతున్నారన్నారు.

కరెన్సీ కట్టల కోసం కేసీఆర్‌ విద్యుత్‌ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని రేవంత్‌ మండిపడ్డారు. విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేత రఘు మీద నిషేధం విధించినప్పుడు మాట్లాడని సంఘాల నేతలు నిన్న ఎందుకు రోడెక్కి ధర్నాలు చేశారని ప్రశ్నించారు. చెన్నూరులో ఒక అధికారి కేసీఆర్‌, కేటీఆర్‌ మీద మాట్లాడితే చర్యలు తీసుకున్నారు.. మరి నా గురించి ఇంత మంది ఉద్యోగులు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకే తాను మొక్కలు అని ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అంటున్నారని, ఏ తేదిలోపు చేయిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కేసీఆర్‌కు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయిందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఆపార్టీలో స్థానం లేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement