
'శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ కేసును గురువారం హైకోర్టు విచారించింది. ఎన్కౌంటర్లో చనిపోయిన శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చెన్నైలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో వీలైనంత త్వరగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.
ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శశికుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసును మధ్యాహ్నం విచారించిన కోర్టు రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.