శ్రీకాకుళం : గురుకులాలపై ఇకపై నిఘా పెరగనుంది. పటిష్ట భద్రతకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలికల పాఠశాల, కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థినులకు రక్షణతోపాటు అధ్యాపకులు, సిబ్బంది పర్యవేక్షణ కోసం ఇటువంటి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ఏడు సాంఘిక సంక్షేమ బాలికలు, నాలుగు బాలుర సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటితోపాటు ఏపీ గురుకులాలు, నాలుగు బీసీ సంక్షేమ గురుకులాలు నడుస్తున్నారుు. అయితే తొలి విడతగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. అలాగే అధ్యాపకులు, సిబ్బంది, ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా, లేదా, సమయపాలన పాటిస్తున్నారా అనే విషయూలను గుర్తించేందుకుగాను బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నారు.
వారితోపాటు విద్యార్థుల హాజరును కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే నమోదు చేయనున్నారు. దీని ద్వారా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది భోజనాలు చేస్తున్నారన్నది తెలుసుకోవచ్చన్నది అధికారుల భావన. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటునకు అవసరమైన పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. జూలై మొదటి వారం లోగా వీటి ఏర్పాటు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
గురుకులాలపై ఇకపై నిఘా
Published Wed, Jun 29 2016 11:56 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement