తుళ్లూరు : ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకోబోయిన ముసునూరు మండల తహశీల్దార్ దోనపల్లి వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో జరిగిన దాడికి నిరసనగా తుళ్లూరు సీఆర్‌డీఏ రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం విధులు బహిష్కరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, సీఆర్‌డీఏ తహశీల్దారు జి.కేశవనాయుడు ఆధ్వర్యంలో గురువారం రాత్రి సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. ప్రభుత్వ స్పందన చూసి తదుపరి కార్యాచరణకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్ త్రిమూర్తులు, తుళ్లూరు డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.