విద్యార్థినిది ఆత్మహత్యా..హత్యా | rishikeshwari death is murder or suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థినిది ఆత్మహత్యా..హత్యా

Published Thu, Jul 23 2015 10:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

rishikeshwari death is murder or suicide

సాక్షి, గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు రిషితేశ్వరిది హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. రిషితేశ్వరి తల్లిదండ్రులు తమ బిడ్డది హత్యేననే అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పటికే మృతురాలికి చెందిన ట్యాబ్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులకు చెందిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లను సైతం స్వాధీనం చేసుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు
అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో పోలీసులు హత్యా కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. రిషితేశ్వరి మృతి చెందిన రోజు ఉదయం కళాశాలకు వచ్చి మధ్యలో హాస్టల్‌కు వెళ్లిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే రిషితేశ్వరి హాస్టల్‌కు వెళ్లే సమయంలో ఆమెను ఎవరైనా అనుసరించారా.. లేక ఆ సమయంలో హాస్టల్‌లో ఎవరైనా ఉన్నారా.. అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లేడీస్ హాస్టల్ వద్ద ఉన్న సెల్‌టవర్ సిగ్నల్‌ను పరిశీలించి రిషితేశ్వరి మృతి చెందిన సమయంలో అక్కడ మరో ఫోన్ ఏమైనా వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
రిషితేశ్వరి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో అనుమానం ఉన్న ఎవరినీ వదలకూడదు. మరో విద్యార్థినికి ఇలా జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏఎన్‌యూ ఔట్‌పోస్టులో వెంటనే పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి.
-ఈడే మురళీకృష్ణ, బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement