వీడని మిస్టరీ ! | Still Suspend In Old Couple Murder Mystery | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీ !

Published Fri, Mar 23 2018 9:18 AM | Last Updated on Fri, Mar 23 2018 9:18 AM

Still Suspend In Old Couple Murder Mystery  - Sakshi

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పక్కన అడిషనల్‌ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ మహేష్‌ తదితరులు

సాక్షి, మచిలీపట్నం: గుడివాడలో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఇందులో గుడివాడకు చెందిన పాత నేరస్తుడి హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. అతనితో పాటు మరొకరి ప్రాత ఉందని గుర్తించి నిందితులను తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌లో అదుపులోకి తీసుకుని గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మీడియా ముందు హాజరు పర్చారు. నిందితులు దొరికినా హత్య ఎందుకు చేశారు? వీరి వెనుక ఎవరి ప్రమేయం ఉంది ? ఇంకా ఎవరిదైనా ప్రోద్బలం ఉందా ? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం పూర్తి స్థాయి వివరాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు...

గుడివాడకు చెందిన పాత నేరస్తుడే..
గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్‌లో నివాసముంటున్న ప్రముఖ వ్యాపార వేత్త బొప్పన సాయిచౌదరి (70), భార్య నాగమణి (65) దంపతులు శుక్రవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటలకు వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి శనివారం ఉదయం నిందితులు పరారైన సమయంలో ఇంటికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, బంధువులు, ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారితో విచారణ ప్రారంభించారు. క్లూస్‌ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆధారాలు కనుగొన్న ప్రత్యేక బృందం ఈ హత్య కేసులో గుడివాడకు చెందిన పాత నేరస్తుడు జిల్లెల సురేష్‌ ప్రమేయం ఉందని గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని  వినియోగించుకుని తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల సురేష్‌ను తమదైన శైలిలో విచారించగా.. తనతో పాటు సెల్వదొరై అలియాస్‌ శివ పాత్ర ఉందని చెప్పడంతో ఈ నెల 18వ తేదీ సాయంత్రం పెరంబదూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు బీజం పడిందిలా..
గుడివాడకు చెందిన జిల్లెల సురేష్‌ తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్‌లోని ఓ మెకానిక్‌ షాప్‌లో పని చేసుకుంటున్నాడు. అతనికి సెల్వదొరై అలియాస్‌ శివతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సురేష్‌కు ఆర్థిక ఇబ్బందులున్న విషయాన్ని ఇద్దరూ చర్చించుకున్నారు. వాటి నుంచి గట్టెక్కేందుకు దొంగతనం చేయాలని నిర్దారించుకున్నారు. ఇందులో భాగంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గుడివాడకు వచ్చిన సురేష్‌ రాజేంద్రనగర్‌ 4వ లైన్లో ఉన్న బొప్పన సాయి చౌదరి, బొప్పన నాగమణి ఇంట్లో చోరీ చేయాలని భావించారు. అప్పటికే సాయి చౌదరి దంపతులు భోజనం ముగించుకుని రాత్రి 10  గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారు. ఇదే అదునుగా భావించిన వీరు రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో నుంచి గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బులు ఇతర వస్తువులు, టీవీతో పాటు కారును కూడా దొంగిలించారు. అనంతరం వారితో తెచ్చుకున్న ఆయుధాలతో హత్యకు తెగబడ్డారు.

అనంతరం విజయవాడ మీదుగా తమిళనాడులోని పెరంబదూర్‌కి పరారయ్యారు. తమకు దొరికిన క్లూతో ప్రత్యేక బృందంతో తమిళనాడులోని పెరంబదూర్‌కి పోలీసులు వెళ్లారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. తమిళనాడు పోలీసుల సహాయంతో గుడివాడ టౌన్‌ సీఐ డీవీ రమణ, సిబ్బంది సహాయంతో పెరంబదుర్‌ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వారెంట్‌మీద మచిలీపట్నం తీసుకొచ్చి మీడియా సమావేశం అనంతరం గుడివాడ అడిషనల్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు న్యాయమూర్తి ఏప్రిల్‌ 4 వరకు రిమాండ్‌ విధించారు.  నిందుతులు దొరికినా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ ముగియలేదని ?  హత్య ఎందుకు చేశారు.? దీని వెనుక ఎవరి ప్రమోయం ఉందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు.ఏఎస్పీ సాయికృష్ణ, గుడివాడ డీఎస్పీ మహేష్, సీఐ తదితరులున్నారు. బంగారు నల్లపూసల దండ, ఐ–ఫోన్, ఐ–ప్యాడ్, టయోటా ఈటాస్‌ కారు, టీవీ. రూ.30,000  నగదు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement