ముంబై: లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి వారింట్లో దొంగతనం చేశాడు. తర్వాత ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. పరారీలో ఉండి 30 ఏళ్ళు రాజాలా బ్రతికాడు. చివరికి ఒక ఫంక్షన్లో బాగా తాగి ఆ మర్డర్ గురించి వాగి పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే..
లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే ఆసామి ఇద్దరు సహచరులతో కలిసి సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తడ్పడ్డాడు.
ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగు కాలవలో పడి చనిపోయినట్టు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఓ పార్టీలో ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను విక్రోలిలో అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నాము. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడు. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదు. చివరకు ఇలా విక్రోలీలో పట్టుబడ్డాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment