ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్‌కు ఊరట దక్కింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్‌గా ఉన్న విజయ్ నాయర్ మద్యం పాలసీ కేసులో 2022లో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్2) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు.
ఏంటి ఈ మద్యం పాలసీ కేసు?
ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.
అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.
దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచి పెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,కవితతో పాటు పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment