
సాక్షి, న్యూఢిల్లీ : వృద్ధ దంపతులను డబ్బు కోసం కిరాతకంగా హతమార్చిన తల్లీ కొడుకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో నివసించే దంపతులను వారి ఇంట్లో పనిచేసే మహిళ, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేసి రూ 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. ఈనెల 26న వృద్ధ దంపతులు వీరేందర్ కుమార్ ఖనేజా (77) సరళ (72)లు కనిపించడం లేదంటూ సమాచారం అందుకున్న పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూడగా విగత జీవులుగా పడిఉన్నారు.
ఫ్లాట్‌కు లోపలివైపు తాళం వేసిన దుండగులు వృద్ధ దంపతుల ఫోన్లను స్విచాఫ్ చేశారు. బాధిత దంపతుల కుమారుడు డాక్టర్ అమిత్ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా వారి ఇంట్లో పనిచేసే మహిళను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించి వివరాలు రాబట్టారు. నిందితురాలు తన కుమారుడితో కలిసి డబ్బు కోసమే వృద్ధ దంపతులను హతమార్చినట్టు అంగీకరించింది.
జనవరి 18న వీరేందర్ ఖనేజా ఇంటి లాకర్‌లో డబ్బు పెడుతున్నప్పుడు గమనించిన నిందితురాలు అదే రోజు మద్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తన కుమారుడిని ఇంట్లోకి రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment