ఆ ఇంటి దీపం ఆరింది | Road accident | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి దీపం ఆరింది

Published Thu, Jul 17 2014 12:11 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

ఆ ఇంటి దీపం ఆరింది - Sakshi

ఆ ఇంటి దీపం ఆరింది

ఆ ఇంటి దీపం ఆరింది. ఆ తల్లి కల చెదిరింది. బంగరు భవిష్యత్‌లోకి అడుగు పెట్టాల్సిన కుమార్తెను ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీయగా, కూతురుపై ఆ తల్లి పెట్టుకున్న ఆశలను  అడియాశలు చేసింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, తల్లి సంధ్యారాణిని కుంగదీసింది. మాజీ సైనికోద్యోగి అయిన భర్త కొంత కాలం కిందట మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృత్యువాత పడడం ఆ తల్లిని తీవ్రంగా కలచివేసింది.
 కడుపుకోతను మిగిల్చింది. ఒంటరి జీవిని చేసింది.
 
 ఫేస్‌బుక్ పరిచయాలు అనర్థాలకూ దారితీస్తాయని చెప్పడానికి ఈ దుర్ఘటన ఓ ఉదాహరణగా నిలిచింది. కొద్దిపాటి పరిచయమైన యువకుడితో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని రాత్రి వేళ బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఎంతమేరకు సురక్షితమనే ప్రశ్నను లేవనెత్తుతోంది. మృతురాలి బంధువుల ఆరోపణలు ఆ యువకుడిని నిందితుడిగా నిలబెడుతున్నాయి. ఆ యువకుడు మభ్యపెట్టటం వల్లే బైక్‌పై వెళ్లి ప్రాణం పోగొట్టుకుందని మృతురాలి పిన్ని, బాబాయిలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ సంఘటనలో మరో కోణంగా నిలిచింది.
 
 మంగళగిరి: సామాజిక వెబ్‌సైట్ల మాయలో పడుతున్న కొందరు యువతీయువకులు తమ జీవితాలను దుఃఖమయం చేసుకుంటున్నారు. మరికొం దరు మృత్యువాత పడుతున్నారు. ఫేస్‌‘బుక్’ వలలో చిక్కుకుని ఓ ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని మృత్యు ఒడికి చేరగా, మరో యువకుడు నిందితుడిగా కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి ....
 
 చిలకలూరిపేటకు చెందిన పినిపే సంధ్యారాణి భర్త జాన్సన్ మాజీసైనికోద్యోగి. కొంతకాలం కిందట మృతి చెందారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె స్వాతిని తల్లి నూజివీడు లో ట్రిపుల్‌ఐటీ చదివిస్తోంది. రెండో సెమిస్టరు సెలవులు రావడంతో కొద్దిరోజుల కిందట స్వాతి ఇంటికి చేరింది. ఇక్కడే ఆమె జీవితం మృత్యుముఖం వైపు మలుపు తిరిగింది. సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో గుంటూరుకు చెందిన సూరజ్‌సింగ్‌తో పరిచయం ఏర్పడింది.  
 
 గుంటూరు నగరంలోని వెంగళరావునగర్‌లో ఉంటూ సెక్యూరిటి సంస్థ నడుతున్న ఆర్.ఎన్. రాజేష్‌సింగ్ కుమారుడు సూరజ్‌సింగ్ ఎంబీఏ వరకూ చదివి ఉద్యోగం రాక ఖాళీగా ఉంటు న్నాడు. ఫేస్‌బుక్‌లో కలిసిన స్వాతితో స్నేహం కలిపాడు. స్వాతి ట్రిపుల్ ఐటీ ద్వితీయ సంవత్సంలో  చేరేందుకు తల్లితో కలసి సోమవారం గుంటూరు చేరుకుంది. ఇక్కడ నుంచి తన స్నేహితులతో కలసి వెళతానని చెప్పడంతో స్వాతి తల్లి చిలకలూరిపేటకు తిరుగు పయనమైంది.
 
 ఇక్కడే తాను ఊహించని ప్రమాదం వైపు స్వాతి అడుగువేసింది. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ సూరజ్‌సింగ్‌కు ఫోన్ చేసి నూజివీడు వెళ్లేందుకు గుంటూరు వచ్చినట్టు తెలియజేసి తనను కలుసుకుంది. రాత్రి 8.30 గంటలప్రాంతంలో ఇద్దరూ బైక్‌పై నూజివీడు పయనమయ్యారు. రాత్రి 12.30 గంటల సమయానికి అక్కడకు చేరుకోవడంతో అంత రాత్రివేళ హాస్టల్‌లో ప్రవేశానికి సెక్యూరిటీ గార్డు నిరాకరించారు.
 
 దీంతో తిరిగి గుంటూరు వెళ్లి తమ ఇంటిలో ఉండి మంగళవారం ఉదయం వద్దామంటూ సూరజ్‌సింగ్ స్వాతికి నచ్చచెప్పాడు. అందుకు అంగీకరించిన స్వాతి అతనితో కలిసి బైక్‌పై తిరుగు పయనమైంది.
 
 మంగళగిరి మండలం చినకాకాని వద్దకు వచ్చేసరికి రాత్రి 2.30 గంటల సమయంలో స్వాతి కప్పుకున్న బెడ్‌షీట్ బైక్ వెనుక చక్రంలో చుట్టుకొంది. స్వాతి అదుపు తప్పి కిందపడి మృతి చెందింది. సూరజ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
 
 మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూరజ్‌ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
 
 మాయమాటలతో మభ్య పెట్టాడు...
 స్వాతి కోసం బుధవారం ఉదయం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి చేరుకున్న ఆమె బాబాయి పి ధర్మరాజు, పిన్ని లలిత, అత్త కరుణలను ‘సాక్షి’ పలకరించగా సూరజ్  మాయమాటలతో మభ్య పెట్టి రాత్రివేళ ప్రయాణం చేయడం వల్ల స్వాతి మృతి చెందిందని ఆరోపించారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
 రాత్రి వేళ హైవే పెట్రోలింగ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఒక్క ఫేస్‌బుక్ పరిచయం స్వాతి తల్లికి కడుపుకోతను మిగల్చగా, యువకుడు సూరజ్‌ను నిందితుడిని చేసిందని సంఘటన గురించి తెలుసుకున్న పలువురు వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement