మృత్యు గంట
Published Wed, Feb 12 2014 1:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
శాటిలైట్‌సిటీ(రాజమండ్రిరూరల్), న్యూస్‌లైన్ :చదువుకుంటున్న విద్యార్థులతో ఆ పాఠశాలలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇంటర్వెల్ బెల్ కొట్టడంతో ఆ పిల్లలంతా అల్లరి చేస్తూ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు. ఆ బెల్ మోగించింది మృత్యు ఘంటికలని.. మరికాసేపట్లో ఓ బాలుడిని మృత్యువు కబళించబోతుందని..
రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ ఎ-బ్లాక్‌లో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఎల్-బోర్డు ఉన్న కారు అదుపుతప్పి స్కూలు విద్యార్థులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన కరణం జాన్‌వెస్లీ(11) మరణించగా, షేక్ నాగూర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శాటిలైట్ సిటీ ఎ-బ్లాక్‌కు చెందిన కరణం జాన్‌వెస్లీ అదే ప్రాంతంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం 10.40 గంటలకు ఇంటర్వెల్ బెల్ కొట్టిన తర్వాత వెస్లీ, అతడి స్నేహితులు షేక్ నాగూర్, దూనబోయిన మణికంఠతో కలిసి చాక్లెట్లు కొనేందుకు దగ్గర్లోని కొట్టుకి వెళ్లారు.
వీరు వెళ్తుండగా, వెనుక నుంచి ఓ కారు అదుపుతప్పి దూసుకొచ్చింది. దానిని గమనించిన ముగ్గరు విద్యార్థులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లేందుకు వెస్లీ యత్నించాడు. ఈలోగా కారు అతడి పైకి దూసుకెళ్లి, ఇంటి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐరన్ గేటుకు, కారుకు మధ్య వెస్లీ ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కారును వెనక్కిలాగి, వెస్లీని కాపాడదామని విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే వెస్లీ మరణించాడు. ఈ ప్రమాదంలో కారు ఢీకొనడంతో నాగూర్ కాలుకు తీవ్ర గాయం కాగా, మణికంఠ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నాగూర్‌ను అతడి కుటుంబ సభ్యులు చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
డ్రైవింగ్ నేర్చుకుంటున్న రిటైర్‌డ ఉద్యోగి
ప్రమాదానికి కారణమైన కారును రిటైర్డు ఉద్యోగి గుత్తుల వెంకటేశ్వరరావు ఇటీవలే కొనుగోలు చేశాడు. అతడికి డ్రైవింగ్ రాకపోవడంతో బిల్లా రమణ అనే వ్యక్తి వద్ద శిక్షణ పొందుతున్నాడు. కారుకు ఎల్-బోర్డు తగిలించి డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనస్థలాన్ని బొమ్మూరు ఎస్సై జాన్‌మియా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన అనంతరం నిందితులు బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.
ఎ-బ్లాక్‌లో విషాదఛాయలు
అందరితోను కలివిడిగా ఉండే జాన్ వెస్లీ మరణవార్త వినగానే అతడి తల్లిదండ్రులు ఇస్సాకు, కుమారి, అన్నయ్య రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి ఇస్సాకు టైల్స్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇంటికి చిన్నవాడైన వెస్లీని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మమ్మల్సి విడిచిపెట్టి వెళ్లిపోయావా కన్నా.. అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ‘తమ్ముడిని చంపిన వారిని వదలను’ అంటూ రవితేజ పడిన ఆగ్రహావేశాన్ని నిలువరించడం స్థానికులకు కష్టసాధ్యమైంది.
నవోదయ పరీక్షలు రాసి..
ఇంటర్వెల్‌లో బయటకు వెళ్లి వస్తాడనుకున్న వెస్లీ కానరాని లోకానికి వెళ్లిపోవడంతో స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం నవోదయ ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాశాడని, తప్పకుండా సెలక్ట్ అవుతానని అందరితో చెప్పాడని ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్లే విద్యార్థులు ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement