బురదమయంగా మారిన కేవీపీ కాలనీ రోడ్డు
గుంటూరు పేరుకే రాజధాని నగరం.. రోడ్లు చూస్తే పల్లెటూరికన్నా అధ్వానం. ప్రధాన రహదారులైనా.. అంతర్గత రోడ్లయినా అడుగడుగునా గుంతల మయం. చినుకుపడిందా రోడ్లన్నీ బురదమయం.. నగరం నడిబొడ్డున ఉన్న మెడికల్ కాలేజీ రోడ్డయినా.. శివారులోని సుద్దపల్లి డొంక అయినా ఒకటే తీరు.. దమ్ముంటే అడుగు పెట్టు.. కింద పడకుంటే ఒట్టు అంటూ వాహనచోదకులకు సవాల్ విసురుతున్నాయి. శివారులోని రోడ్లన్నీ జర్రుజర్రున జారుతూ పాదచారులతో పరాచికాలు ఆడుతున్నాయి. ఓ ప్రణాళికంటూ లేకుండా అధికారులు చేపట్టిన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) నిర్మాణ పనులు రోడ్లను ధ్వంసం చేసి నగర ప్రజలకు నెలల తరబడి నరకం చూపుతున్నాయి.
నగరంపాలెం(గుంటూరు): నగరంలో రహదారులు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. ప్రధాన రహదారులతోపాటు, కాలనీ మెయిన్, అంతర్గత రోడ్డు అధ్వానమయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల కోసం ప్రణాళిక లేకుండా రహదారులను పగలగొట్టారు. నగరంలోని కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారం, ఎన్‌జీవో కాలనీ, శ్యామలనగర్, నాయీబ్రాహ్మణ కాలనీ, ఎస్‌వీఎన్ కాలనీ, స్వర్ణభారతినగర్, నగరాలు, శారదాకాలనీ, ఆదిత్యనగర్, రాజీవ్‌గాంధీనగర్, నెహ్రూనగర్, మంగళదాస్‌నగర్, పాత గుంటూరు, సుద్దపల్లి డొంకలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పైపు లైన్ల కోసం తీసిన గుంతల్లో మట్టి సక్రమంగా తరలించకపోవడంతో అవి సిమెంట్ రోడ్లపై పడి రూపురేఖలు కోల్పాయాయి. వర్షాలకు సిమెంటు రోడ్లు కాస్తా బురద రోడ్లను తలపిస్తున్నాయి. కలెక్టరేట్ రోడ్డు, అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, జీటీ రోడ్డు, ఏటుకూరు రోడ్డులలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వాహనాలు వెళ్లడం కష్టతరమైంది. వానకు బురద, ఎండకు దుమ్ముతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.
పునరుద్ధరణ లేదు
యూజీడీ పనుల కోసం గతేడాది ఫిబ్రవరిలో తవ్విన రోడ్లనూ పునరుద్ధరించలేదు. వీటిపై సీఎం కంప్లైంట్ సెల్‌కు భారీగా ఫిర్యాదులు వెళుతున్నాయి. యూజీడీ పనుల నిమిత్తం పగలగొట్టిన 500 కిలోమీటర్ల మేర రహదారులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, అప్పటి వరకు వేరే రోడ్ల జోలికి వెళ్లొద్దని జూన్ చివరి వారంలో కలెక్టర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. వీటిలో 200 కిలోమీటర్లు ఉన్న సీసీ రోడ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనీ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులను, రవాణా శాఖ నుంచి యంత్ర సామగ్రిని, కార్మిక శాఖ నుంచి కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. పునరుద్ధరణ చేయాల్సిన ప్రాంతాలను 15 జోన్లగా విభజించి ప్రతి రోజూ పది కిలోమీటర్ల మేర పునరుద్ధరించాలని ఆదేశించారు. కానీ రోజుకు మూడు కిలో మీటర్లు కూడా పునరుద్ధరణ పనులు సాగడం లేదు.
మరమ్మతులు చేపట్టండి
మా ప్రాంతంలో యూజీడీ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లన్ని ఆధ్వానంగా తయారయ్యాయి. వర్షాలు కురిసినప్పుడు ఈ రోడ్ల మీద నడవాలంటే నరకంగా మారింది. ఉదయం పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలి. – గఫూర్, తారకరామనగర్
Comments
Please login to add a commentAdd a comment