నిబంధనలకు విరుద్ధంగా, లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమైన సంఘటన తర్వాత కూడా అధికారులు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ వైపు కన్నెత్తి చూడలేదు.
జగిత్యాల టౌన్/కోరుట్ల రూరల్, న్యూస్‌లైన్:
నిబంధనలకు విరుద్ధంగా, లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమైన సంఘటన తర్వాత కూడా అధికారులు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత ఎండమావిగా మారిందని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భద్రత డొల్లగా మారిందని ఁసాక్షిరూ.లో కథనం వచ్చింది. దీంతో రవాణా శాఖ అధికారులు ఒక్కసారిగా లేచారు. సోమవారం జగిత్యాల నుంచి ముంబై వెళ్తున్న మూడు బస్సులను కోరుట్ల మండలం మోహన్‌రావుపేట శివారులో పట్టుకొని సీజ్ చేశారు. పట్టుబడ్డ బస్సులు దత్తసాయి, కుమార్, ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందినవని ఎంవీఐ కిషన్‌రావు తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో అనుమతి తీసుకొని స్టేజ్ క్యారేజ్ కింద జగిత్యాల నుంచి ముంబైకి నడుపుతున్నారని చెప్పారు.
ప్రైవేట్ దెబ్బకు ఆర్టీసీ బస్సు రద్దు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దెబ్బకు ముంబై వెళ్లే ఆర్టీసీ బస్సులో సీట్లు నిండక ఆర్టీసీ అధికారులు బస్సును రద్దు చేశారు. ముంబైకి బయలుదేరే ఆర్టీసీ బస్సుకు అరగంట ముందు ప్రైవేట్ బస్సులు నడపడంతో పాటు, ప్రయాణికులకు ఆర్టీసీ కన్నా మెరుగైన సౌకార్యాలు కల్పిస్తామంటూ బస్సులు నడుపుతున్నారు. దుబాయ్, సౌదీ అరేబియా వెళ్లేవారు జగిత్యాల ట్రావెల్స్ బస్సుల్లో ముంబైకి వెళ్తుంటారు. ఇదే అదనుగా ట్రావెల్స్ యజమానులు అక్రమంగా బస్సులు నడుపుతున్నారు.
రక్షణ చర్యలుంటేనే బస్సులకు పర్మిట్
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : కాంట్రాక్టు క్యారేజ్(సీసీ) బస్సులకు రక్షణ చర్యలుంటేనే పర్మిట్లు ఇస్తామని డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(డీటీసీ) మీరా ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తాత్కాలిక పర్మిట్లతో సీసీ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. బస్సులకు అన్ని రకాల రక్షణ చర్యలు ఉండాలని, లేకుంటే తాత్కాలిక పర్మిట్ ఇవ్వబోమన్నారు. సీసీ బస్సులను ఎంవీఐలు పూర్తిస్థాయిలో తనిఖీ చేసి నిబంధనల మేరకు ఉన్నాయని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ ఇస్తేనే పర్మిట్ ఇస్తామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సంఘటన దృష్ట్యా నిబంధనలు పాటించని సీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట అధికారులు దుర్గాప్రమీల, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.