ప్రాణాలు గాలిలో దీపాలు
Published Thu, Oct 31 2013 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
సాక్షి, నరసరావుపేట: ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి వల్ల ఎందరో ప్రయాణికులు నిద్రలోనే తనువుచాలిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే సౌకర్యవంతంగా త్వరగా గమ్యస్థానాలకు చేరవచ్చనే ఆశతో ప్రయాణిస్తున్న ఎన్నో కుటుంబాలు ప్రమాదాల బారిన పడి శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో టికెట్ ధర కంటే రెట్టింపు వసూలు చేస్తూ దందా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులకు కనీస భద్రత కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి. వేల కిలో మీటర్లు ప్రయాణించే బస్సుల్లో సుశిక్షితులైన ఇద్దరు డ్రైవర్లను నియమించాల్సిన యాజమాన్యాలు డబ్బుకు కక్కుర్తి పడి ఒకే డ్రైవర్‌చేత వాహనాన్ని నడిపిస్తుండటంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వోల్వో బస్సులను ఫైబర్‌బాడీతో డెకరేట్ చేయడం, కుర్చీలకు క్లాత్‌లాంటి కవర్‌లు వినియోగిస్తుండటంతో అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
దీనికితోడు బస్సులను 120 నుంచి 150 కి.మీ స్పీడుతో నడుపుతుండటంతో ఏసీ బ్లోయర్‌లు వేడెక్కి ప్రమాదానికి గురికాగానే మంటలు వ్యాపిస్తున్నాయి. డోర్‌లకు ఆటోమేటిక్ లాక్‌లు అమర్చడం, అత్యవసర ద్వారాలు లేకపోవడంతో ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటకు వెళ్లలేక మృత్యువు పాలవుతున్నారు. లగేజీలను చెక్ చేయకపోవడం, గ్యాస్ సిలిండర్‌లు, బాణసంచా వంటివి కూడా కొందరు రవాణా చేస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఒక్కొక్క ట్రావెల్ యజమానికి 50 నుంచి 100 బస్సులు ఉండటంతో పర్యవేక్షణలోపంతో పాటు నిర్లక్ష్యధోరణి తోడు కావడంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. రాజకీయ అండ దండలుండటంతో వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధికారులను సైతం లెక్కచేయటం లేదు.
ప్రమాదం జరిగినప్పుడు
కనీసం పట్టించుకోనివైనం...
ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి ప్రయాణికులను ఆసుపత్రులకు చేర్చి బాగోగులు చూడాల్సిన ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన సంఘటనలో వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషయం పత్రికలు, మీడియా ద్వారా మాత్రమే తెలుసుకున్నాం తప్ప తమకు ట్రావెల్స్ యాజమాన్యం ఎటువంటి సమాచారం అందించలేదని అప్పట్లో వీరి బంధువులు ఆరోపణలు చేశారు. జనవరి 2 తెల్లవారుజామున ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. వీరందరిని స్థానికులు, పోలీసులు 108 వాహనం ద్వారా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు త రలించారు. చికిత్స పొందుతున్న ప్రయాణికుల పరిస్థితి ఎలాగుందనే విషయం కూడా పట్టించుకోకుండా సదరు ట్రావెల్స్ యాజమాన్యం మిన్నకుండిపోయింది.
బస్సు దగ్ధమై దంపతుల మృతి..
తాజాగా బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు పాలమూరు జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన గాలి బాలసుందరరాజు, మేరి విజయకుమారి దంపతులు మృతి చెందారు. అయితే ప్రమాద ఘటనను టీవీ ద్వారా చూసి తెలుసుకున్నామేగానీ ట్రావెల్స్ యాజమాన్యం కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుంటే
కఠిన చర్యలు తప్పవు
- గుంటూరు డీటీసీ సుందర్
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాహనాలపై దాడులు నిర్విహ ంచి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ వోల్వో బస్సుల్లో సుశిక్షితులైన ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఒక్క డ్రైవర్‌తోనే వేల కిలో మీటర్లు వాహనాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి వాహనాల పర్మిట్లను రద్దు చేస్తాం. డ్రైవర్లు సైతం తమ హెవీ లెసైన్సును రెన్యువల్ చేసుకునేటప్పుడు కచ్చితంగా మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రస్తుతం ఢిల్లీలో ఈ పద్ధతి అమలులో ఉంది.
Advertisement
Advertisement