హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న అనిల్ సింగ్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అనిల్ సింగ్ కుమారుడు అక్షయ్ సింగ్ ఈ ప్రమాదంలో అశువులు బాశాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అక్షయ్ సింగ్ ఈ నెల 26న తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్కు రావాల్సి ఉంది.
అప్పుడు వాయిదా వేసుకుని దీపావళి పండుగకు హైదరాబాద్ కు ప్రయాణమయ్యాడు. ఇంతలోనే బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. అక్షయ్ సింగ్ తండ్రి చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్షయ్ సింగ్ మృతితో చిక్కడపల్లిలోని అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
పండుగకు సొంతవూరు వస్తూ మృత్యువాత
నిజామాబాద్ : దీపావళి పండుగ వేళ సొంత వూరికి వస్తున్న వారు గమ్యం చేరుకోకుండానే బస్సు రూపంలో మృతువాత పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవుని పల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి ఉన్నారు. సాప్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న వేదపతికి 11 నెలల క్రితమే స్వర్ణ లత అనే యువతితో వివాహం అయింది. పండగకు వస్తానని ఫోన్ ఇంట్లో వారికి చెప్పారు. ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, భార్యకు ప్రమాద సమాచారం తెలిసి కుప్పకూలిపోయారు. వేదపతి మరణించాడని తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది.
ఇంటికి వస్తే మృత్యుఒడికి చేరిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు
కరీంనగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో విషాదాన్ని నింపింది. నంచర్లకు చెందిన విట్టు అమరేందర్ బెంగళూరు క్యాప్‌జెమిని సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి గతేడాది జగిత్యాలకు చెందిన నర్మదతో వివాహమైంది. దీపావళి సందర్భంగా అమరేందర్ స్వస్థలానికి బయలుదేరాడు.
అనుకోకుండా బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం నర్మద గర్భవతి కావడంతో ఆమెకు భర్త మరణించిన విషయం తెలియజేయలేదు. ప్రస్తుతం అమరేందర్ మృతితో బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాడనుకుంటే... ఊహించని విధంగా మృత్యుఒడికి చేరాడని, తమకింక ఎవరు దిక్కంటూ మృతుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వైద్య పరీక్షలకు వస్తూ తిరిగిరాని లోకానికి
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. బెంగళూరులో ఉంటున్న సుందర రాజు, అతని భార్య ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్కు తరచూ వస్తుంటారు. ఆ క్రమంలోనే మంగళవారం రాత్రి బెంగళూరులో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు బయలు దేరారు. అయితే మార్గ మధ్యంలోనే ప్రమాదం జరిగి భార్యభర్తలిద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే మృతులు సుందరరాజు స్వగ్రామం తాళ్లూరులోనూ, అతని భార్య సొంతూరు రావి పాడులోనూ విషాద చాయలు అలముకున్నాయి.
పండుగ రూపంలో మృత్యువు కబళించింది
Published Wed, Oct 30 2013 1:23 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement