వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలోని హవేరి జిల్లా కునిమళ్లహళ్లి వద్ద ఈ తెల్లవారుజామున మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మంటలు లేచాయంటే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైపోతుంది. వోల్వో బస్సు ప్రమాదానికి గురైందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే.
బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్‌కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురై కాలి బూడిదైపోయింది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతులలో ఒకరిని ముంబైకి చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన భార్య,భర్త, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తన పాస్‌పోర్టు, డాక్యుమెంట్లు కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ అనే ప్రయాణికుడు వాపోతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సును గత సంవత్సరమే కొనుగోలు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హవేరీ జిల్లా ఎస్పి శశికుమార్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్లు కర్నాటక మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. వరుసగా వోల్వో బస్సులే ప్రమాదానికి గురవుతుండటంతో బస్సు నిర్మాణంలో లోపాలు ఏమైనా ఉన్నాయోమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వోల్వో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అయితే వోల్వో బస్సు సురక్షితమైనదని రిటైర్డ్ జాయింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గాంధీ చెప్పారు. డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.