రైల్లో దోపిడీ | robbers looted valuables of passengers in train | Sakshi
Sakshi News home page

రైల్లో దోపిడీ

Published Wed, Apr 2 2014 2:11 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

రైల్లో దోపిడీ - Sakshi

రైల్లో దోపిడీ

పిడుగురాళ్ల/సికింద్రాబాద్, న్యూస్‌లైన్: దోపిడీ దొంగలు చెన్నై  నుంచి హైదరాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేశారు. సుమారు 30 మంది దుండగులు మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో రైల్లో స్వైర విహారం చేసి, అందినకాడికి దోచుకున్నారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే 100 గ్రాముల బంగారు ఆభరణాలు, మరికొన్ని లక్షలు విలువ చేసే సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కొంత నగదు దోచుకెళ్లారు. దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారమే దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ రైల్లో గుంటూరు ఆర్పీఎఫ్ సిబ్బంది పిడుగురాళ్ల వరకు విధుల్లో ఉంటారు.
 
 మరో పోలీసు బృందం నడికుడిలో రెలైక్కుతుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య పోలీసులెవరూ రైల్లో ఉండరు. అంతేకాకుండా శ్రీనివాసపురం వద్ద ఉన్న రైల్వే ట్రాకు అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారికి అతిసమీపంలో ఉంటుంది. దోపిడీ అనంతరం పరారయ్యేందుకు అనువుగా ఉంటుంది. అందుకే దోపిడీకి ఈ ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. ముందుగా 10 మంది పిడుగురాళ్లలో రెలైక్కారు. రైలు పిడుగురాళ్ల దాటి 77/3 మైలు రాయి పరిసరాల్లో శ్రీనివాసపురం వద్దకు చేరుకొనే సమయానికి అక్కడే ఉన్న మరో 20 మంది రైల్వే ట్రాక్‌కు పక్కన పత్తి కట్టలతో మంట వేశారు. ఈ మంటలను చూసిన రైల్లోని దుండగులు చైను లాగి రైలును నిలిపివేశారు. వెంటనే అందరూ కలిసి ఏసీ బోగీతోపాటు ఎస్-5, ఎస్-7, ఎస్-9, ఎస్-11, ఎస్-12 బోగీల్లోకి చొరబడ్డారు. 43 నిమిషాలపాటు అరుపులు, కేకలతో  ప్రయాణికులను బెదిరిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. కొందరు ప్రయాణికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, దుండగులు వంటికి నూనె రాసుకోవడంతో, తప్పించుకోగలిగారు. అనంతరం రైలు నడికుడి స్టేషన్‌కు చేరుకొన్నాక రైలు గార్డు అక్కడి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదీ.. ఎవరో చైను లాగటం వల్ల రైలు 40 నిమిషాలు ఆగిందని మాత్రమే ఫిర్యాదు చేశారు. చోరీ జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు.
 
 దుండగులను పట్టుకుంటాం: ఎస్పీ శ్యాంప్రసాద్
 
 మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో జీఆర్పీ విజయవాడ రీజియన్ ఎస్పీ శ్యాంప్రసాద్, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె మాలకొండయ్య, సీఐ పి.శరత్‌బాబు, ఇన్‌స్పెక్టర్ డి.శ్రీనివాసరావు, జీఆర్‌పీ సీఐ శేషగిరిరావు, నడికుడి ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొన్నారు. అక్కడ వారికి కాలిపోయిన పత్తి కట్టలు, రోల్డుగోల్డు నల్లపూసల గొలుసు మించి ఇతర ఆధారాలు లభ్యం కాలేదు. ఉదయం 9.30 గంటల సమయంలో డాగ్‌స్క్వాడ్ వచ్చి పరిశీలించినప్పటికీ, ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఘటన జరిగిన 3 గంటల్లోపు మాత్రమే డాగ్‌స్క్వాడ్ ఆధారాలను పసిగట్టగలుగుతుందని, అయితే, ఏడు గంటల తర్వాత రావడంతో ఆధారాలు దొరకలేదని కొందరు అధికారులు తెలిపారు. ఎస్పీ శ్యాంప్రసాద్ పిడుగురాళ్ల స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ మాస్టర్ కూచిపూడి వరకృపాకరరావును విచారించారు. అక్కడ రైలు ఎక్కిన వారి వివరాలు సేకరించారు. చోరీకి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ శ్యాంప్రసాద్ తెలిపారు.  ఇక నుంచి బీటు  సిబ్బందిని నడికుడి వరకు పొడిగిస్తామని, మరో 2 టీములను ఏర్పాటుచేస్తామని చెప్పారు. తెల్లవారుజామున 2 నుండి 4 గ ంటల మధ్య దోపిడీలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నుంచి రైలులో దోపిడీలకు పాల్పడే వారిపై తమ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపుతారని స్పష్టంచేశారు.
 
 సికింద్రాబాద్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
 
 రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత 8 మంది బాధితులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ పోలీసులు కేసును తదుపరి విచారణ నిమిత్తం గుంటూరు జిల్లా రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఎస్5 బోగీలో గౌరి హారిక (మియాపూర్)కు చెందిన 4 తులాల బంగారు గొలుసు, స్వర్ణ ప్రియాంక (కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు) నుంచి సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగు, ఎస్7 బోగీలో దుర్గాలక్ష్మి (పశ్చిమ గోదావరి)కి చెందిన 8 తులాల బంగారం, ఎస్9 బోగీలోని అనుశంకర్ (కోయంబత్తూర్) నుంచి 32 గ్రాముల బంగారు గొలుసు, ఎస్11 బోగీలోని శ్రీవాణి (ఆల్విన్ కాలనీ, మియాపూర్)కు చెందిన 8 గ్రాముల బంగారు గొలుసు, హ్యాండ్‌బ్యాగ్, అదే బోగీలోని వెంకట సుధీర్ (చందానగర్)కు చెందిన 24 గ్రాముల బంగారు గొలుసు, ఎస్12 బోగీలోని ఫాతిమా (సికింద్రాబాద్ వారాసిగూడ) నుంచి 15 గ్రాముల బంగారుగొలుసు, ప్రియాంక నుంచి రూ. 70 వేలు విలువచేసే సెల్‌ఫోన్, మినీలాప్‌టాప్ (ట్యాబ్లెట్)ను దుండగులు చోరీ చేసినట్లు పోలీసులకు పిర్యాదు చేశారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement