నారాయణవనం : చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఆదివారం ఉదయం ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగింది. అయితే దుకాణదారుల అప్రమత్తతతో కొద్దిసేపటికే నిందితులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం నారాయణవనంలోని ఓ నగల దుకాణం తెరుస్తుండగానే ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు దుకాణంలోకి ప్రవేశించారు. ఆభరణాలు చూపించాలని కోరటంతో సిబ్బంది వారికి కావాల్సిన వస్తువులను చూపించారు. అయితే ఆగంతకులు వాటిలో నుంచి 60 గ్రాముల బంగారు నగలను మాయం చేసేశారు. వారు వెళ్లిన తర్వాత కొన్ని నగలు కనిపించకపోవటంతో దుకాణం సిబ్బంది అనుమానంతో సీసీ ఫుటేజిని పరిశీలించారు. దాంతో దుకాణం సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. స్థానికులిచ్చిన సమాచారంతో పక్కనే పుత్తూరులో ఉన్న నిందితులను పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఆ ముగ్గురూ పాత నేరస్తులేనని, వారిపై దొంగతనం కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.