సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే?
ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.
గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్‌లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.
హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment