►వజ్రాల కన్నులు, బంగారు గంటలు చోరీ చేసేందుకు వ్యూహం
►సాధ్యపడకపోవడంతో దక్షణమూర్తి విగ్రహం చోరీ
వెంకటగిరిటౌన్ : కాశీవిశ్వనాథస్వామి దేవస్థానంలో దక్షణామూర్తి విగ్రహం చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచే చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించారు. చోరీలో రైల్వే కోడూరుకు చెందిన శ్రీను, నరసింహులే పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఏకశిల ధ్వజస్తంభంపై ఉన్న నంది విగ్రహం కన్నులుకున్న వజ్రాలు, ధ్వజస్తంభానికి ఉన్న బంగారు గంటలను చోరీ చేసే వ్యూహంతో దుండగులు వచ్చారు. అది సాధ్యపడదని గ్రహించి దేవస్థానంలో ఉన్న దక్షణామూర్తి విగ్రహంపై కన్నేశారు.
చోరీ జరిగిన 11వ తేదీన సాయంత్రం 5.00 గంటలకే దేవస్థానానికి చేరుకుని అప్పటి నుంచి అక్కడే ఉండి అశోకచెట్టు మార్గం ద్వారానే రాత్రివేళ విగ్రహం తస్కరించారు. ఆ సమయంలో విగ్రహం బరువుకు పట్టుతప్పి శ్రీను అనే నిందితుడి చేయి విరిగింది. శ్రీను తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చోరీ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో వ్యక్తికి ఫోన్‌చేసి కారు తెప్పించుకొని విగ్రహాన్ని మల్లమ్మదేవస్థానం వీధి మీదుగా పాకాలకు చేర్చారు.
ఈ కేసు ఛేదించడంలో ఎస్సై వీరేంద్రబాబు వద్ద ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా సెల్‌ఫోన్ నెంబర్లను కనుగొని 11వ తేదీ వెంకటగిరి కాశీవిశ్వనాథస్వామి దేవస్థానం ప్రాంతంలో వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్లు, ఆ తర్వాత ఆ నంబర్లు విరివిగా ఉపయోగించడం వంటి కీలక ఆధారాలతో అనుమానితులను ప్రశ్నించి కేసును తేల్చారు. గతంలో వెంకటగిరి రాజాప్యాలెస్‌లో జరిగిన చోరీతో ఈ విగ్రహం చోరీ కేసులోని నిందితులకు సంబంధం ఉన్నట్లు సమాచారం. పట్టణంలో వినిపిస్తున్న ఊహాగానాలు. నిజాలను పోలీసుల నిగ్గుతేల్చాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరు ఐసీ కార్యాలయంలో దక్షణామూర్తి విగ్రహం భద్రపరిచారు. కేసు పూర్వాపరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
జనవరి నుంచే చోరీకి రెక్కీ
Published Mon, May 25 2015 12:58 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement