రూ.22.7 లక్షల ఎర్రచందనం స్వాధీనం
Published Wed, Oct 16 2013 5:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
పుత్తూరు, న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు చోట్ల అటవీ అధికారులు రూ.22.7లక్షల విలువజేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు అటవీశాఖ పరిధిలోని జాతీయ రహదారిలో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం తెల్లవారుజామున లారీ సహా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని ఫారెస్టు రేంజి ఆఫీసర్ నాగరాజు వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ జయశంకర్ తన బృందంతో వడమాలపేట మండల పరిధిలోని అంజేరమ్మ కనుమ దిగువ భాగంలో వాహనాల తనిఖీ చేపట్టారు. తిరుపతి వైపు నుంచి చెన్నై వైపు వెళుతున్న పది టైర్ల లారీని ఆపినా ఆగకుండా వెళ్లింది. దీంతో సుమారు 6 కిలో మీటర్ల దూరం వెంబడించి పుత్తూరు బైపాస్‌లోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద లారీని అడ్డుకున్నారు. కాగా డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. లారీలో ఉన్న రూ.15 లక్షల విలువజేసే 61 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఐదుగురి అరెస్ట్
పీలేరు, న్యూస్‌లైన్ : వేర్వేరు ప్రాంతాల్లో రెండు వాహనాలు, రూ. 7.7 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామని పీలేరు డీఎఫ్‌వో నాగార్జునరెడ్డి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎర్రావారిపాళెం మండలం చింతగుంట గ్రామం, చెక్కనాయని చెరువు వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలించడానికి సిద్ధమవుతున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులోని ఏడు ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి చప్పిడిరెడ్డిప్రసాద్, కేతంరెడ్డి ఆనందరెడ్డి, జలకం రాజా, కే. వినోద్‌కుమార్, షేక్. ఖాదర్‌బాషాను అరెస్ట్ చేశారు. అలాగే తిరుపతి -పీలేరు రహదారిలో పులిచెర్ల క్రాస్‌వద్ద సోమవారం రాత్రి నిఘా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా పీలేరు వైపు వెళుతున్న కారును గుర్తించి సిబ్బంది వెంబడించారు. అటవీ సిబ్బందిని గమనించి డ్రైవర్ పెద్దగొట్టిగల్లు సమీపంలో కారును ఆపి పరారయ్యాడు. కారును పరిశీలించగా అందులో 8 ఎర్రచందనం దుంగలు ఉన్నారుు. కారును, ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలు, 15 ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.7.70 లక్షలు చేస్తాయని డీఎఫ్‌వో తెలిపారు. ఈ దాడిలో అటవీ క్షేత్రాధికారి ఎంవీ సుబ్బారెడ్డి, ఎఫ్‌ఎస్‌వో ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎఫ్‌బీవో కే. ప్రకాష్‌కుమార్, వి.నాగరాజు, ఏబీవో సి.రాజారెడ్డి, ప్రొటెక్షన్ వాచర్లు రెడ్డిశేఖర్, లవన్న, నాగార్జుననాయక్, మల్లికార్జున, జయప్రకాష్ పాల్గొన్నారు.
Advertisement