- అరకొరగా బడ్జెట్
- బకాయి చెల్లింపులకే చాలని నిధులు
- అందని స్కాలర్‌షిప్పులు...
- చెల్లించని ఫీజు రీయింబర్స్‌మెంట్
విజయనగరం ఫూల్‌బాగ్: జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 47 కోట్లు కావాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు 47 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిధులు ఉంటే తప్ప బీసీ విద్యార్థుల సంక్షేమం చేపట్టలేమని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఎటూ చాలడం లేదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది (2014-15) విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 5.85 కోట్లు, ఉపకార వేతనాలకు 5.90 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 1.18 కోట్లను రెన్యూవల్ కింద విడుదల చేసింది.
ఈ నిధులు బకాయిలు చెల్లింపునకు కూడా చాలడం లేదు. గత ఏడాది (2013-14) విద్యా సంవత్సరానికి కొత్త విద్యార్థులకు (ఫెషర్స్‌కి) ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు విడుదల కాలేదు. దీంతో వీరి చదువులు ప్రశ్నార్థకమైంది.
ఏ ఏడాదీ పూర్తి స్థాయి బడ్జెట్ లేదు
ఏ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులకు సరిపడినంత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో ఏ ఏడాది విడుదలైన బడ్జెట్‌ను బకాయిలు చెల్లిస్తున్నారు. దీంతో ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
హాస్టల్ విద్యార్థులకు అందని ఉపకారవేతనాలు
హాస్టల్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందకపోవడంతో నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో బీసీ వెల్ఫేర్‌కు సంబంధించి డిపార్టుమెంట్ హాస్టళ్లు 18 ఉన్నారు. బాలుర, బాలికలకు తొమ్మిది చొప్పున ఉన్నాయి. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం, కురుపాం నియోజకవర్గాలో రెండేసి చొప్పున వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,564 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 887 మంది బాలికలు, 677 మంది బాలురు ఉన్నారు. జిల్లాలో కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు 24 ఉన్నాయి.
మహారాజా కళాశాల అనుంబంధ వసతిగృహం, ఎంఆర్ పీజీ, ఎస్‌కెడి వసతిగృహం, తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిరుమల కాలేజీ ఆఫ్ నర్సింగ్, లక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్, వైద్య మెడికల్ హెల్త్ సెన్సైస్, ఎంవీజీఆర్ (విజయగరం), మిమ్స్ మెడికల్ కాలేజీ (నెల్లిమర్ల), సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ (గరివిడి), పుణ్యగిరి డిగ్రీ, వివేకానంద డిగ్రీ, చైతన్యడిగ్రీ, ఐవీఎన్ రాజు డిగ్రీ (ఎస్.కోట) సాయిసిద్ధార్థ (గజపతినగరం), గోకుల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (బొబ్బిలి)లో ఉన్నాయి. అయితే గతేడాది కాలేజీ అటాచ్డ్ హాస్టల్స్‌గా ఉన్న వివేకవర్ధిని (చినబోగిలి), వివేకానంద జూనియర్ కాలేజీ (ఎస్.కోట), గాయత్రి డిగ్రీ (సీతానగరం), ఎస్‌వికెసీడీ (కురుపాం) తదితర వసతిగృహాలను ఎత్తివేశారు. ఈ విద్యార్థులకు 2013-14 విద్యాసంవత్సరానికిగాను ఉపకారవేతనాలు విడుదల కాలేదు.
26,262 మందికి మొండి చేయి
2013-14లో 26,262 మందికి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. జిల్లాలో 57,262 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెన్యువల్(ద్వితీయ, తృతీయ సంవత్సరం) విద్యార్థులు 31 వేల మంది ఉన్నారు. వీరిలో 11,280 మందికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా మరో 4,210 మం దికి ఉపకారవేతనాలు మంజూరు చేశారు. 26,262 మంది విద్యార్థులకు మొండిచేయి చూపించారు.
2013-14 బడ్జెట్ వివరాలు
- 2013-14లో 48.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
- ఇందులో 27.42 కోట్లు 2012-13వ సంత్సరం బకాయిలకు కేటాయించారు
- 2013-14లో విద్యార్థుల రెన్యువల్ కోసం 11.97 కోట్లు మంజూరు చేశారు.
- ప్రభుత్వం మంజూరు చేసిన 48.55 కోట్లలో 9.16 కోట్లు విడుదల చేయలేదు.
బీసీ వెల్ఫేర్‌కు రూ.47 కోట్లు కావాలి!
Published Sat, Jun 21 2014 5:06 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement