
రూ. 5.5 కోట్ల పొగాకు బుగ్గి
చిలకలూరిపేట రూరల్: మండలంలోని బొప్పూడి రెవెన్యూ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదంలో గోదాములోని పొగాకు బుగ్గి పాలైంది.చిలకలూరిపేట అగ్నిమాపక శాఖాధికారి వేలూరు భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జాతీయ రహదారి సమీపంలో మెసెస్ సుబ్బయ్య పిళ్ళై (మద్ది లక్ష్మయ్య) కంపెనీ ఆవరణలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రెండో వరుసలోని రెండో గోడౌన్ నుంచి మంటలు చెలరేగడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే కంపెనీ ప్రతినిధులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. గోదాములో నిల్వ ఉంచిన 3.50 లక్షల కిలోల పొగాకు బేళ్లకు మంటలు వ్యాపించాయి.
అధికారులు చిలకలూరిపేట, బాపట్ల, గుంటూరు-1,2, నరసరావుపేటలకు చెందిన ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ప్రమాదంలో రూ.5.5 కోట్ల పొగాకు కాలి బూడిదైంది. గోడౌన్‌పై కప్పుగా ఏర్పాటు చేసిన రేకులు కుప్పకూలాయి. రూ 1.5 కోట్లు విలువ చేసే గోడౌన్ నిరుపయోగంగా మారింది. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న పొగాకు అగ్నిప్రమాదంలో బూడిదగా మారడంతో కంపెనీ ప్రతినిధులు వాపోయారు. జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జిలానీ, సహాయాధికారి రత్నబాబు, తహశీల్దార్ ఫణీంద్రబాబు, రూరల్ సీఐ సంజీవ్‌కుమార్, ఎస్‌ఐ జగదీష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.