
ఆర్టీసీని కేంద్రం ఆదుకోవాలి
విజయవాడ : రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడే లోటు బడ్జెట్‌ను భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు విడిపోవడం వల్ల నష్టపోయిన ఏపీఎస్ ఆర్టీసీని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సమావేశం ఆదివారం స్థానిక సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని నాడార్స్ ఫంక్షన్ హాలులో జరిగింది. తొలుత యూనియన్ జెండాను సారథి ఆవిష్కరించారు.
అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం, భూస్థాపితం చేయడంలో చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు మరెవరికీ లేవని విమర్శించారు. గతంలో డెయిరీలను నిర్వీర్యం చేసి సొంత డెయిరీని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆర్టీసీని దెబ్బతీసి ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను దశలవారీగా ఇంటికి పంపాలని చూస్తే, టీడీపీని ప్రజలే సాగనంపుతారని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎంవీ టాక్స్‌ను 15 శాతం పెంచి ఆర్టీసీని ఆర్థికంగా నష్టపోయేలా చేశారని పేర్కొన్నారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 2004లో బాధ్యతలు స్వీకరించిన వైఎస్సార్ ఎంవీ టాక్స్‌ను ఏడు శాతానికి తగ్గించి ఆర్టీసీకి మేలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
ఆర్టీసీని కాపాడుకుంటాం : గౌతమ్‌రెడ్డి
ప్రభుత్వం ఆర్టీసీ రూ.2వేల కోట్ల నష్టాల్లో ఉందని చెబుతూ ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ఆర్టీసీకి రూ.12వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని, మార్కెట్ విలు ప్రకారం వాటి ధర రూ.30వేల కోట్లకు పైగా ఉంటుందని ఆయన వివరించారు. ఆర్టీసీ ప్రైవేటుపరం కాకుండా వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ తరఫున పోరాటాలు చేసి కాపాడుకుంటామని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ యూనియన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఎ.రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీకి టాక్స్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనధికార ప్రైవేట్ ఆపరేటర్లను నియంత్రించి ఆర్టీసీకి మేలు చేయాలని కోరారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూనియన్‌ను బలోపేతం చేసి ఆర్టీసీ వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఎస్ ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి పీవీ రమణ, కోశాధికారి సీవీఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్, నేతలు ఎంబీఎల్ శాస్త్రి, పి.రవికాంత్, 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.