అనంతపురం క్రైం : రూ. లక్ష పెట్టుబడితే చాలు రూ. 3 లక్షలు హవాలా డబ్బు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం చేస్తున్న అంతర్రాష్ర్ట దొంగల ముఠాకు చెక్ పెట్టారు అనంతపురం సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు. ఈ మేరకు బుధవారం స్థాని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి సీసీఎస్ డీఎస్పీ విజయకుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు : స్థానిక జేఎన్‌టీయూ కళాశాల సమీపంలో నివసిస్తున్న పీకే వీరన్న ఇటీవల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బీకేఎస్ ఆనంద్ పీకే వీరన్నకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అయితే ఆర్నెళ్ల కిందట ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వీరన్నను కలిసినప్పుడు ఆనంద్ తనతో పాటు ఉన్న మరికొందరిని పరిచయం చేస్తూ తామంతా హవాలా డబ్బు మారుస్తుంటామని చెప్పాడు. బెంగళూరులో తమకు తెలిసిన వారి వద్ద హవాలా డబ్బు ఉందని రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. 3 లక్షలు ఇప్పిస్తామంటూ నమ్మబలికాడు. దీంతో నమ్మిన తాను అత్యాశకు పోయి రూ. 3లక్షలు సదరు ముఠాకు అందజేసి మోసపోయానంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నేపథ్యం ఇది: అరెస్ట్ అయినవారిలో కర్నాట కకు చెందిన కృష్ణసింగ్, బీకేఎస్ ఆనంద్ ముఖ్యులు. బెంగళూరులతో తమకు తెలిసి న చాలామందితో హవాలా డబ్బు మూలుగుతోందని రూ. లక్షకు రూ. 3లక్షలు ఇస్తారంటూ నమ్మిస్తారు. హవాలా డబ్బు అసలైందనే తేల్చేలా ముఠా సభ్యులే తమవద్దనున్న కొంత డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయించి నిరూపిస్తారు. దీంతో అమాయక ప్రజలు నమ్మి వీరికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఏదైనా అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని డబ్బుతో అక్కడికి రమ్మని సూచి స్తారు.
తీరా డబ్బుతో వెళ్లాక...ఈ ముఠా మాటల్లో కలుపుతుండగానే మఫ్టీ పోలీసుల అవతారంలో ఈ ముఠాలోని మరికొందరు సభ్యులు అక్కడికి ప్రత్యక్షమవుతారు. పోలీ సులు వచ్చారంటూ కేకలు వేస్తూ అమాయకుల వద్దనున్న డబ్బును దోచుకెళ్తారు. అక్కడికీ డబ్బు ఇవ్వకపోతే వేటకొడవళ్లతో చం పుతామని బెదిరించి ఆ డబ్బును కొల్ల గొడతారు. ఇలా ఆర్నెళ్ల నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేశారు.
ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు : ఈ విషయం ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికెళ్లింది. ఈ మోసాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ మోసం చేసిన ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి చేదించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ బి.విజయకుమార్, వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్, సీసీఎస్ సీఐలు దేవానంద్, రాజశేఖర్, ఎస్‌ఐలు విశ్వనాథ్‌చౌదరి, వెంకటరమణ, రాజు, వెంకటరెడ్డి, శ్రీరాం, ఏఎస్‌ఐ సాదిక్, హెచ్‌సీలు రజాక్, పైగంబర్‌వలి, కానిస్టేబుళ్లు శేషు, ఫరూక్, జాకీర్, శ్రీనివాసులు, రామాంజనేయులు, సుధాకర్, రామ్మోహన్, డోనాసింగ్ తదితరులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. డీఎస్పీ విజయకుమార్‌కు పక్కా సమాచారం రావడంతో బుధవారం స్థానిక ముసలమ్మకట్ట వద్ద నిందితులను పట్టుకున్నారు. రూ.16 లక్షల నగదు, నాలుగు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాల్యాద్రి మాట్లాడుతూ ఇలాంటి మోసాలకు గురి కావద్దని ప్రజలకు సూచించారు.