అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ములకలచెరువు: అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాడులకు ఉపయోగించిన కర్రలు, ఇనుప రాడ్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ రుషికేశవ్ మంగళవారం తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 5 వ తేదీన మండలంలోని వేపూరికోట పంచాయతీ ఆవులవారిపల్లి క్రాస్ వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ఈచర్ వాహనం డ్రైవర్ రామక్రిష్ణ(32)పై దోపిడీ ముఠా కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి రూ.23 వేలు దోచుకున్నారు.
బాధితుడి ఫిర్యాధు మేరకు పోలీసులు కేసునమోదు చేసి ధర్యాప్తు చేపట్టిన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దోపిడీ దొంగలు పెద్దపాళ్యం మీదుగా కదిరి వెళ్తున్నట్లు సీఐ రుషికేశవ్‌కు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఒక మహిళ ఉంది. వీరంతా కర్ణాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన వారు. జే.మల్లికార్జున(33), సుబ్రమణ్యం(22), ఎం.సతీష్(26), ఎస్.హసీనా(25), కే.నాని(24), ఎన్.మంజునాథ్(30), ఎన్.గంగాధర్(25), ఏ,నరేష్(22), ఆర్.సురేష్(22)లను అరెస్టు చేశారు.
మహిళను అడ్డుపెట్టుకొని దాడులు:
మహిళను అడ్డంపెట్టుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. రాత్రి సమయాల్లో వాహనాలను మహిళ సహాయంతో టార్చ్ లైట్ వేసి ఆపి, డ్రైవర్‌తో వ్యభిచారానికి భేరం కుదుర్చుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ముఠా సభ్యులతో దాడులు నిర్వహించి దోపిడీ చేస్తున్నారు. వీరు అనంతపురం, కదిరి తదితర ప్రాంతాల్లో సుమారుగా 30 చోట్ల దాడులు చేశారు. కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాధు అందలేదు.
రెండు ద్విచక్రవాహనాలు, కారు స్వాధీనం:
ముఠా సభ్యులు దాడులకు పాల్పడటానికి ఉపయోగించిన రెండు ద్విచక్రవాహనాలు, ఒక ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రెండు టార్చ్‌లైట్లు, తొమ్మిది సెల్‌ఫోన్స్, ఆరు కర్రలు, మూడు ఇనుపరాడ్లను, రూ.1100 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ముఠా సభ్యుల దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు:
ముఠా సభ్యుల సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారిజామున పెద్దపాళ్యం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మదనపల్లి వైపు నుంచి కదిరి వైపుకు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు ఆపకుండా పోలీసు సిబ్బందిపైకి దూసుకొచ్చారు. గమనించిన సిబ్బంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం వారిని పోలీసులు వెంబడించి కారును పట్టుకున్నారు. కారు లోపల ఉన్న ముఠా సభ్యులు పోలీసులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడులో క్రైం కానిస్టెబుల్ శిరాజ్‌బాషకు తీవ్రగాయాలయాయ్యి. గాయపడిన కానిస్టెబుల్‌ను మదనపల్లి ఏరీయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.