దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
మహిళల వేషంలో హైవేపై దోపిడీలు
దొరవారిసత్రం (సూళ్లూరుపేట) : జల్సాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఆదివారం దొరివారిసత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పొలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఇన్‌చార్జ్ గూడూరు డీఎస్పీ కే శ్రీనివాసాచారి విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి శ్రీరామ్, నెల్లూరులోని బోడిగాడుతోట ప్రాంతానికి చెందిన నాగుల అజయ్, ముత్తుకూరుకు చెందిన డేగా శీనయ్య, సోగా వెంకటేశ్వర్లు, నెల్లూరు వెంకటేశపురానికి చెందిన సోగా వినోద్, శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి వెంకటేష్ దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి తదితర మండల ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో లారీ డ్రైవర్లను దోచుకుంటున్నారు.
వీరిలో శ్రీరామ్ మహిళ వేషంలో రహదారిపై నిలిచి లారీడ్రైవర్లు, క్లీనర్లను ఆకర్షిస్తుంటాడు. వీరిని పొదల్లోకి తీసుకెళ్లగా, అక్కడే ఉన్న మిగతా ఐదుగురు కలసి వారిని కొట్టి వారి వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. దోపిడీ దొంగల వ్యవహారంపై దొరవారిసత్రం ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి నిఘా ఉంచారు. ఈ క్రమంలో దోపిడీ మఠా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లే రెండు లారీల డ్రైవర్లను ఇలాగే ఆకర్షించి గుమ్మిడిపూండి జోసెఫ్, జమ్మల రంగారావుపై ఆరుగురు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.13 వేల నగదు దోచుకున్నారు. దుండగులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు. వెంకటగిరి శ్రీరామ్ నేర చరిత్ర కలిగిన యువకుడు. ఇతనిపై నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు కూడా ఉన్నాయి. బాధిత డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు రివార్డులు
హైవే దోపిడీ ముఠాతో ఈ ప్రాంతంలో వాహనదారుల గత కొన్ని రోజులుగా హడలిపోయారు.దొరవారిసత్రం ఎస్సై, పోలీసులు పగడ్బందీగా హైవే ముఠా పట్టుకునేందుకు కృషి చేయడంపై జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ పోలీసులను అభినందించారు. హెచ్‌సీలు రాఘవ, వెంకటయ్య, పీసీలు సునీల్, బాబ్జి, కిషన్, వెంకటేశ్వర్లు, హెచ్‌జీ షాహుల్, డ్రైవర్ నరేష్‌కు డీఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్‌ఐ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.