దారిదోపిడీ దొంగలు చిక్కారు | road robbers arrested | Sakshi
Sakshi News home page

దారిదోపిడీ దొంగలు చిక్కారు

Published Mon, Nov 21 2016 9:47 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

దారిదోపిడీ దొంగలు చిక్కారు - Sakshi

దారిదోపిడీ దొంగలు చిక్కారు

- 10 మంది నిందితుల అరెస్ట్‌
- పరారీలో నలుగురు 
- రూ.30 వేల నగదు, ఐదు మోటర్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు, ట్యాబ్, ఆటో స్వాధీనం
కర్నూలు: కర్నూలు శివారులో దారిదోపిడీకి పాల్పడిన దొంగలు పోలీసులకు చిక్కారు. శరీన్‌నగర్‌కు చెందిన పఠాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు తొమ్మిది మంది మైనర్‌లను తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు, ఐదు మోటర్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు, శ్యామ్‌సంగ్‌ ట్యాబ్, ఆటో, నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం ఓఎస్‌డీ రవిప్రకాష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా విజిలెన్స్‌ డీఎస్పీ రాజేశ్వరరెడ్డికి సంబంధించిన శుభకార్యం హైదరబాదులో జరిగింది. సమీప బంధువులు కార్యక్రమానికి హాజరై ఈనెల 17వ తేదీ రాత్రి ఏపీ02 ఏటీ1111 వాహనంలో అనంతపురం వెళ్తుండగా కర్నూలు కార్బైడ్‌ ఫ్యాక్టరీ సమీపంలోని మానస డాబా వద్ద టైర్‌ పంక్చర్‌ అయింది.  డ్రైవర్‌ గోపాల్‌రెడ్డి టైరు పంక్చర్‌ చేస్తుండగా మద్యం సేవించిన దొంగలు డ్రైవర్‌ను డబ్బు ఇవ్వాలని బెదిరించారు. అతను నిరాకరించడంతో మూడు కత్తి పోట్లు పొడిచి గాయపరిచారు. కారులో ఉన్న ముగ్గురు మహిళలను కూడా బెదిరించి డ్యాష్‌బోర్డుపై ఉన్న ట్యాబ్‌ను దొంగలించారు. అక్కడి నుంచి మోటర్‌సైకిల్‌పై దూపాడు వద్దకు చేరుకుని కల్పన డాబా నిర్వాహకుడు బోయ సతీష్‌ను గొంతు నులిమి బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నగదుతో పాటు సిగరెట్‌ ప్యాకులను దొంగలించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్‌ సీఐ నాగరాజ యాదవ్, ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యంరెడ్డి, గిరిబాబు, వెంకటేశ్వరరావు వారి సిబ్బందితో టీములుగా ఏర్పడి కేసు మిస్టరీని ఛేదించారు. 
సీసీ ఫుటేజీ ద్వారా నిందితులు గుర్తింపు:
కల్పనా డాబాలో ఉన్న సీసీ ఫుటేజీలలో ఉన్న నిందితుల ఫొటోల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్దనున్న ఇందిరమ్మ గృహాల్లోని పాతబడిన ఇంట్లో దాచుకుని ఉన్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు పల్సర్‌ మోటర్‌సైకిళ్లు, రెండు ట్విస్టర్‌ బైకులు, ఒక ఎఫ్‌జడ్‌ మోటర్‌సైకిల్, ఒక ప్లాటినా మోటర్‌ సైకిల్, ఒక ఆటో, శ్యామ్‌సంగ్‌ ట్యాబ్, ఐదు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన కత్తి, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. వీరితో పాటు నేరంలో పాల్గొన్న మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు సీఐలు మహేశ్వరరెడ్డి, నాగరాజు యాదవ్, ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి, గిరి బాబు, వెంకటేశ్వరరావు, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 
 
వీరి నేరాల చిట్టా... 
– కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇదే నిందితులు ఆగస్టు మొదటి వారంలో దారి దోపిడీకి పాల్పడ్డారు. పాండిచ్చేరికి చెందిన లారీలను నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆపి డ్రైవర్, క్లీనర్లను చితకబాది వారి దగ్గర డబ్బును దోచుకున్నారు. రెండు దోపిడీ కేసులలో వీరు ముద్దాయిలు. 
– పంచలింగాల వద్ద జరిగిన దారిదోపిడీ, కట్టమంచి స్కూల్‌ దగ్గర చోరీ కేసులో వీరు నిందితులు. 
– ఉలిందకొండ, సల్కాపురం ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. 
– నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆటోను దొంగలించి దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డారు. 
– కర్నూలు నగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న ఒక వ్యక్తిని హత్య చేయడానికి రూ.1.40 లక్షలు కాంట్రాక్టు కుదుర్చుకుని ప్రయత్నించారు. సమాచారం లీక్‌ కావడంతో ఆ వ్యక్తి అప్రమత్తమై తప్పించుకున్నాడు. 
– మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 
– ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వీరిపై బైండోవర్‌ కేసులు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement