చిల్లర దోపిడీ | Rupee up 50 paise per liter from the exploitation | Sakshi
Sakshi News home page

చిల్లర దోపిడీ

Published Sun, Sep 21 2014 4:34 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

చిల్లర దోపిడీ - Sakshi

చిల్లర దోపిడీ

 - పెట్రోల్ బంకుల్లో ఇష్టారాజ్యం
- ఫిక్స్‌డ్ మిషన్లను వినియోగించని నిర్వాహకులు
 - ప్రతి లీటర్‌పై 50 పైసల నుంచి రూపాయి వరకు దోపిడీ
- కొలతల్లోనూ మతలబు
-  పట్టించుకోని పౌర సరఫరాల శాఖ అధికారులు
అనంతపురం రూరల్ : అనంతపురం నగరానికి చెందిన జ్ఞానేష్ అనే ఉద్యోగి పెట్రోల్ వేయించుకోవడానికి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లోని ఓ బంకుకు వెళ్లారు. రూ.వందకుపెట్రోల్ వేయమన్నారు. పంప్ బాయ్ రూ.99.41కు మాత్రమే వేశాడు. ‘ఇదేమిటి?! ఫిక్స్‌డ్ మిషన్ ద్వారా వే యొచ్చు కదా’ అని జ్ఞానేష్ ప్రశ్నించారు. అందుకు అతను ‘ఇష్టముంటే వేయించుకో.. లేకపోతే పో’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ పరిస్థితి ఒక్క జ్ఞానేష్‌కు మాత్రమే కాదు.. జిల్లాలో వినియోగదారులందరికీ రోజూ ఎదురవుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులు బహిరంగంగానే నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఎవరైనా ప్రశ్నిస్తే.. వారితో గొడవ పెట్టుకుంటున్నారు. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి వారిలో కన్పిస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. తనిఖీలు చేయకుండా నిద్రమత్తులో జోగుతున్నారు. దీంతో వినియోగదారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు.
 
నిత్యం రూ.లక్షల్లో దోపిడీ : జిల్లా వ్యాప్తంగా 225 పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 117, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీ) 70, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) బంకులు 38 ఉన్నాయి. ప్రతి నెలా పెట్రోల్ 4,600 కిలో లీటర్లు (ఒక కిలో లీటర్ వెయ్యి లీటర్లకు సమానం), 2,780 కిలోలీటర్ల డీజిల్ విక్రయమవుతోంది. ఇదే రోజుకైతే డీజిల్ 927, పెట్రోల్ 153 కిలోలీటర్లు అమ్ముడవుతోంది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.35, డీజిల్ రూ.64.23 ఉంది. వినియోగదారులు మాత్రం రూ.75, రూ.65 చొప్పున ఇవ్వాల్సి వస్తోంది.

రూపాయలు కాకుండా.. పైసలు తిరిగి ఇవ్వడం కష్టం కనుక రూ.50, రూ.100..ఇలా వేయించుకోవాలని స్వయాన పౌర సరఫరాల శాఖాధికారులే సూచిస్తున్నారు. వారు చెబుతున్నట్లుగా కొంత మంది వేయించుకుంటున్నా.. దోపిడీ మాత్రం ఆగడం లేదు. పెట్రోల్ బంకుల్లో ‘ఫిక్స్‌డ్’ మీటర్లు వాడడం లేదు. అనేక బంకుల్లో నేటికీ అవి లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుడు రూ.వందకు పెట్రోల్ వేయమంటే రూ.99.5లోపే మీటర్ ఆపేస్తున్నారు. దీనికితోడు ‘పెట్రోల్ గన్’ ట్రిగ్గర్‌ను మధ్యమధ్యలో వదిలి పెట్టడం ద్వారా మీటర్‌ను జంప్ చేస్తూ కొలతల్లోనూ కొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం బంకుల నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తామని ఇటీవల డ్వామా హాలులో జరిగిన సమావేశంలో మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. అయితే, అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న సూచనలు కన్పించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement