శ్రీకాకుళం రైతు బజారు
సాక్షి, శ్రీకాకుళం: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేం దుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆర్థిక చేయూత, రాయితీల కల్పనతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన కార్యరూపం దాల్చింది. ఇందులో భాగంగా మన జిల్లాకు ఐదు కొత్త రైతు బజార్లు వస్తున్నాయి. ఇప్పటికే కేటాయింపు ఉత్తర్వులు మార్కెటింగ్ శాఖకు వచ్చాయి. స్థల సేకరణ పూర్తి చేసిన వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఒక్కో రైతు బజార్‌కు రూ. 50లక్షల వరకు మంజూరు కానుంది.
పండించిన కూరగాయలను రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు వీలుగా జిల్లాలో మరో ఐదు రైతు బజార్లను ఏర్పాటు చేయబోతోంది. తగిన ధరకు అమ్ముకునే అవకాశం రైతులకు దక్కనుండగా, తాజా కూరగాయలు వినియోగదారులకు బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మాళిలో మాత్రమే రైతు బజార్లు ఉన్నాయి. ఇవి కాకుండా టెక్కలిలో మరొకటి నిర్మాణంలో ఉంది. తాజాగా మంజూరైన వాటితో జిల్లాలో రైతు బజార్ల సంఖ్య తొమ్మిదికి చేరనుంది.
కొత్తవి ఏర్పాటు చేసేదిక్కడే
జిల్లాకు కొత్తగా మంజూరైన రైతు బజార్లను నరసన్నపేట, పలాస, రాజాం, పాలకొండ, కొత్తూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే లిఖితపూర్వక ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వ పరిశీలన నేపథ్యంలో పాలకొండ, కొత్తూరులో స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. మిగతా నరసన్నపేట, రాజాం, పలాసలో స్థలసేకరణ చేయాల్సి ఉంది. వీటి కోసం సంబంధిత తహశీల్దార్లకు స్థలసేకరణ ఉత్తర్వులు పంపించారు. ఒక్కొక్క రైతు బజారులో 40నుంచి 50వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. స్థలసేకరణ పూర్తి చేసి పంపించిన వెంటనే ప్రభుత్వం ఒక్కో దానికి సుమారు రూ. 50లక్షలు మంజూరు చేసేందుకు అవకాశముంది.
శ్రీకాకుళంలో..
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ప్రస్తుతానికి ఒకే ఒక రైతు బజారు ఉంది. ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్ రైతు బజారు ఏర్పాటు చేయాలన్న యోచనకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నం, రాజ మహేంద్రవరంలో మాత్రమే మొబైల్ రైతు బజార్లు ఉన్నాయి. ప్రజల చెంతకే రైతు బజారు కూరగాయలు రానున్నాయి. రైతుల నుంచి సేకరించిన కూరగాయలను గ్రేడింగ్ చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలో మంజూరు కానుంది. శ్రీకాకుళం పట్టణ వాసుల డిమాండ్ దృష్ట్యా మొబైల్ రైతు బజారుతో పాటు ఉన్న రైతు బజారును ఆధునీకరించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 15 స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్, ఇతరత్రా సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో రానున్నాయి.
రైతులకు మేలు
జిల్లాకు కొత్తగా ఐదు రైతు బజార్లు మంజూరయ్యాయి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనలో భాగంగా మన జిల్లా కు ఐదు కేటాయించారు. ఇప్పటికే కొత్తూరు, పాలకొండలో స్థల సేకరణ చేశాం. పలాస, రా జాం, నరసన్నపేటలో సేకరణ చేయాల్సిం ఉంది. తహసీల్దార్లను స్థల సేకరణ కోసం పంపించాం.
– బి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment