సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రైతన్నలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
నేడు రైతుల ఖాతాల్లో రూ.2,800 కోట్లు జమ
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం.
సీజన్ ఆరంభంలో అన్నదాతకు ఆర్థిక సాయం..
► 2019–20 రబీ సీజన్ నుంచి ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం అమల్లోకి తెచ్చింది.
► గత ఏడాది రబీలో ఈ పథకం ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు సాయం అందింది.
► ప్రస్తుత ఖరీఫ్‌లో లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 49,43,590కి పెరిగింది. ఇందులో రైతు భరోసా జనరల్ ఖాతాలు 46,28,767 కాగా చనిపోయిన కుటుంబాల నామినీలు 61,555 మంది, అన్ సీడెడ్ వెబ్‌ల్యాండ్ ఖాతాలు 1,58,949, అన్‌సీడెడ్ నాన్ వెబ్ ల్యాండ్ ఖాతాలు 53,076, ఎండోమెంట్ భూముల సాగుదారులు 623 మంది, అటవీ భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు 40,620 మంది ఉన్నారు.
► డేటా బేస్ ఆధారంగా అర్హులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద రైతు కుటుంబాలకు రూ.13,500 మూడు విడతలుగా అందిస్తారు. మొత్తంగా ఈ ఏడాదికి ప్రస్తుతం తొలి విడతలో రూ.7,500 చొప్పున రూ.3,675 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతుంది.
► భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు కూడా రూ.13,500 సాయం అందుతుంది. ఈ వర్గాలకు చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. 18వ తేదీ నుంచి విత్తనాల విక్రయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులు కరోనా విపత్తుతో ఇబ్బంది పడకుండా 15 నుంచే నగదు జమను ప్రారంభిస్తున్నారు.
రైతు భరోసాకు మరో రూ.96 కోట్లు విడుదల
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఈ ఏడాదిలో తొలి విడత సాయం అందించేందుకుగాను ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి అదనంగా మరో రూ.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, బుధవారం రూ.409.47కోట్లను విడుదల చేసిన సంగతి తెలసిందే. అలాగే, వర్షాధారిత ప్రాంత అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.
(నోట్: ఇతరులలో చనిపోయిన కుటుంబాల నామినీలు, అన్ సీడెడ్ వెబ్‌ల్యాండ్ ఖాతాలు, అన్‌సీడెడ్ నాన్ వెబ్ ల్యాండ్ ఖాతాలు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు ఉన్నారు.)
Comments
Please login to add a commentAdd a comment