నాగార్జున సాగర్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్‌గేట్లను బుధవారం ఎత్తి దిగువకు నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 583 అడుగులకు చేరిందని చెప్పారు. బుధవారం ఉదయం వరకు నీటి మట్టం 585 నుంచి 590 అడుగుల మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. కాగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 2,36,901 క్యూసెక్కులు నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందన్నారు. సాగర్‌లో 588 అడుగుల నీటిమట్టాన్ని మొయింటెనెన్స్ చేస్తూ శ్రీశైలం నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా నీటిని దిగువకు వదలనున్నట్లు వివరించారు. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నందునా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి కోరారు.
మూడు జోన్లకు నీటి విడుదల
నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండినందునా ప్రాజెక్టు పరిధిలోని మూడు జోన్లకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదనీటిని బట్టి మొదట కుడి, ఎడమ కాల్వల పరిధిలోని మొదటి జోన్‌లకే నీటి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పోంగిపోర్లడంతో పాటు సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వస్తుందన్నారు. జలాశయంలో నీటి లభ్యతను బట్టి ప్రాజెక్టు పరిధిలోని 21.5 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీటివిడుదల చేసేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ఆయకట్టు రైతులంతా ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ హృదయరంజన్, డీఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Published Wed, Aug 7 2013 4:20 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement