తుఫాన్ ప్రభావిత జిల్లాగా గుర్తింపు | Said latest move the government closing in on the elections. | Sakshi
Sakshi News home page

తుఫాన్ ప్రభావిత జిల్లాగా గుర్తింపు

Published Fri, Jan 24 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Said latest move the government closing in on the elections.

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కార్ సరికొత్త ఎత్తుగడ వేసింది. రోజు రోజుకి చేజారుతున్న కేడర్, వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కాస్త దగ్గరయ్యేందుకు జిల్లాను తుపాను ప్రభావిత జిల్లాగా ఎంపిక చేసింది. జిల్లాలో తీవ్ర కరువు నెలకొన్నా కనికరించని ప్రభుత్వం ఉన్నపళంగా తుపాను ప్రభావిత జిల్లాగా ఎంపిక చేయడం వెనుక ఎన్నికల ఎత్తుగడేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన పై-లీన్ తుపాను, భారీ వర్షాల ప్రభావిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జిల్లాలోని 34   మండలాలపైనా ఈ వర్షాల ప్రభావం ఉన్నట్టు నిర్ధారించింది. దీంతో జిల్లా రైతాంగానికి కొంత ఊరట లభించనుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందనుంది. అక్టోబర్‌లో వచ్చిన పై-లీన్ తుపాను, భారీ వర్షాలు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల పంటలను నాశనం చేశాయి. రోడ్లు, ఇళ్లు, చెరువులు, కాలువలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ. 113 కోట్ల మేర నష్టం జరిగినట్టు అధికారులు అప్పట్లో అంచనా వేశారు. 
 
 ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. పంట నష్టం రూ. 24. 13 కోట్లు కాగా రోడ్లు, మంచినీటి పథకాలు, చెరువులు, భవనాలు, ఇళ్లకు రూ. 89. 59 కోట్ల నష్టం వాటిల్లినట్టు నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే మత్స్యశాఖకు సంబంధించి రూ. 58 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. కానీ వీటిపై ఇంతవరకు స్పందించలేదు.   తాజాగా జిల్లాలోని 34 మండలాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల రైతులకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయి. ఇన్‌ఫుట్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే దెబ్బతిన్న ఆస్తుల పునరుద్ధరణకు నిధులు వి డుదలయ్యే అవకాశం కూడా ఉంది.  కాకపోతే తుపాను ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో నెంబర్.3 ప్రకారం మళ్లీ క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించనున్నారు. వాస్తవ లబ్ధిదారులను ఎం పిక చేసి తదననుగుణంగా పరిహారం కోసం సిఫారసు చేయనున్నారు. 
 
 వ్యూహాత్మకమే...
 జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో   దాదాపు 19 మండలాల్లో పంట ఎండి పోయింది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం కేవలం ఐదు మండలాలను మాత్రమే కరువు మండ లాలుగా ప్రకటించింది. దీంతో అత్యధిక మంది రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రైతన్నపై సర్కారుకు కరుణ లేదని, రైతు వ్యతిరేకి ప్రభుత్వమని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో ఫై-లీన్, అల్పపీడన ప్రభావిత జిల్లాగా ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా తాజా ప్రకటనని పలువురు పెదవి విరుస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement