సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం
Published Mon, Sep 9 2013 1:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అందులో భాగంగా 11న హైకోర్టు వద్ద మానవ హారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకున్నా బుధవారం మానవహారం నిర్వహిస్తామని చెప్పారు. న్యాయవాదులతోపాటు కోర్టు సిబ్బంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణవాదులైన న్యాయవాదులు ఇకపై తెలంగాణకు సంబంధించిన వారి కేసులనే వాదించాలని బార్ కౌన్సిల్ సభ్యుడు కె.రవీందర్‌కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణ న్యాయవాదుల్లో 90 శాతం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని, మిగిలిన కొద్దిమందే ఇరు ప్రాంతాల వారి మధ్య చిచ్చుపెడుతూ వైషమ్యాలను పెంచుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో సమైక్యాంధ్ర న్యాయవాదులపై దాడి బాధాకరమన్నారు. ఏపీఎన్జీవోల బస్సులపై దాడులు సరికాదన్నారు. న్యాయవాది పద్మ మాట్లాడుతూ శాంతియుతంగా మానవహారం చేపడితే మహిళా లాయర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ చిదంబరం, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.హరినాథ్, న్యాయవాదులు కోటేశ్వరి దేవి, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement