- మదనపల్లెలో విద్యార్థులతో భారీ ర్యాలీ
- తిరుపతిలో హోరెత్తిన సమైక్య నినాదం
- చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద నిరసన
సాక్షి, చిత్తూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఆదివారం నిర్వహించిన సమైక్య రన్ విజయవంతమైంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లో ఎన్‌జీవో జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర రన్, ర్యాలీ లు నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, వాణిజ్యపన్నులు, ఖజానా, రవాణాశాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలో తుడ మైదానం నుంచి తిలక్‌రోడ్డు, గ్రూప్‌థియేటర్‌స రోడ్డు, తెలుగుతల్లి విగ్రహం వరకు సమైక్య రన్ సాగింది.
శాప్స్‌తో సహా ఉద్యోగుల జేఏసీ, డాక్టర్లు, న్యాయవాదుల జేఏసీ, విద్యార్థి జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. సమైక్య నినా దాలు మిన్నంటాయి.మదనపల్లెలో 10 వేల మంది విద్యార్థులతో సమైక్యాంధ్ర కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. బీటీ కళాశాల నుంచి పురవీధుల మీదుగా ఆర్‌టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి సమైక్య రన్ ప్రారంభించారు. ఎంఎస్‌ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్ మీదుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని అక్కడ నుంచి తిరిగి గాంధీ విగ్రహం వద్ద రన్ ముగించారు.
కేంద్రం తీరు పట్ల నిరసన తెలిపారు. పీలేరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో గోకుల్ సర్కిల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోనియా గాంధీ, కిల్లి కృపారాణి, పనబాకలక్ష్మి, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ధరించిన టీ షర్‌టలు ఆకట్టుకున్నాయి.