ఇసుక ఫ్రం శ్రీకాకుళం
ఉచితమన్న మాటే గాని ఇసుక బంగారమైపోరుుంది. జిల్లాలో చూద్దామంటే కనిపించడం లేదు. ఉన్న ఇసుకను కాస్తా లాభాపేక్షతో విశాఖ నగరానికి తరలించేస్తున్నారు. సిక్కోలు ఇసుక నిర్మాణాల్లో భేషుగ్గా ఉంటుందనే పేరుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో జిల్లా నుంచి విశాఖకు ఇసుక లారీలు క్యూకడుతున్నాయి. దీనికి అధికార పార్టీ నేతలూ వత్తాసు పలుకుతున్నారు. ఫలితంగా మన జిల్లాలో నిర్మాణాలకు ఇబ్బందులెదురవుతున్నారుు. కొందామంటే రాన్రానూ ప్రియమైపోతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విశాఖలో భారీ పరిశ్రమలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇసుక చాలా అవసరం. విశాఖలో అనుమతిచ్చిన రీచ్‌ల కంటే పొరుగునే ఉన్న జిల్లా నుంచి ఇసుక తెప్పించుకుంటే సమయం వృథాతో పాటు ఖర్చులు కూడా తక్కువే. లారీ ఇసుక కనీసం రూ.30వేల నుంచి రూ.40వేలకు ధర పలుకుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇసుక మన్నికైనది. నిర్మాణాల్లో ఈ ఇసుక ఉపయోగిస్తే నిర్మాణాల జీవితకాలం మరింత ఎక్కువ వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడదే అభిప్రాయం తెలుగుదేశం నేతలకు కాసులు పండిస్తోంది.
ఏ నాయకుడు ఎక్కడ మాట్లాడినా జిల్లా అవసరాల్ని ఆలోచించకుండా విశాఖకు ఇసుక ఇవ్వండంటూ అధికారులకు హుకుం జారీ చేసేస్తున్నారు. అధికార పార్టీ కావడంతో అధికారులూ తలొగ్గాల్సివస్తోంది. అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. విశాఖలో ఇటీవల పది లారీల ఇసుకను పోలీసులు సీజ్ చేయడం తెలిసిందే.
ఇదీ పరిస్థితి
ఇసుక ఉచిత పాలసీ ప్రకటించిన తరువాత నాలుగు రీచ్‌ల్ని జిల్లా పరిధిలో ప్రకటించారు. తరువాత బుచ్చిపేట ర్యాంపు తవ్వకాల్ని ఆపేశారు. ఆరీచ్‌లో ఎంత పరిణామంలో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోయిందీ అధికారికంగా లెక్కల్లేవు. తాజాగా మరో 9చోట్ల అనుమతించారు. పర్లాం, అంథవరం ర్యాంపుల్లోని ఇసుకను వివిధ ప్రాజెక్టులకు అనుమతించారు. అక్కడ ప్రాజెక్టుల అవసరాల కంటే ఇతర సమయాల్లో పొరుగు ప్రాంతాలకు తరలిపోతున్న ఇసుక సంఖ్యే ఎక్కువని స్థానికులు చెబుతున్నారు.
వీటిపై నిఘా కరువైంది. పొన్నాం ఇసుక బట్టీల్ని విశాఖ అవసరాల కోసం కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ గత నెల 29న అనుమతిచ్చారు. తాజాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కూడా విశాఖ అవసరాలకు ఇసుక కేటాయించాలని, హయాతినగరంతో పాటు మరో మూడు ర్యాంపుల్ని కేటాయించే అవకాశాన్ని చూడాలంటూ సోమవారం నాటి సమావేశంలో కోరారు.
ఇదీ డిమాండ్
రాజాం పరిధిలో నిర్మాణాలకు అవసరమైన ఇసుక లేదంటూ, అక్కడి రీచ్‌ల్లో అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కంబాల జోగులు కలెక్టర్‌ను కోరారు. ఇచ్చాపురం, పాతపట్నం, పాలకొండ పరిధిలో సామాన్యులకు ఇసుకే దొరక డం లేదు. కొత్తూరు, భామిని మండలాల్లో అపారమైన ఇసుక ఉన్నా ఒడిశా అనుమతి లేకపోవడంతో రీచ్‌లకే పరిమితమైపోయింది. జిల్లా మంత్రి సొంత నియోజకవర్గం టెక్కలి పరిధిలోనూ ఇసుక దొరకడం లేదు. ఆ వాసులంతా పొరుగు నియోజకవర్గాల పరిధిలో ఇసుక తెప్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి అవసరాలకు భిన్నంగా విశాఖకు ఇసుక తరలించాలంటూ నేతలు, అధికారులు ఇసక్తి చూపించడం గమనార్హం. గత ఇసుక పాలసీ నేపథ్యంలో విశాఖ బిల్డర్లు సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు సమక్షంలోనే తమకు శ్రీకాకుళం జిల్లా ఇసుక ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇక్కడ నుంచి ఇసుక పంపించాల్సిన అవసరం వచ్చింది.
ఉచిత ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత పొరుగు రాష్ట్రాలు దాటితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించింది. విశాఖ అవసరాల ప్రస్తావన ఎక్కడా రాలేదు. నేతలు మాత్రం విశాఖపైనే మక్కువ చూపిస్తున్నారు. కారణం..ఒక్కో లారీ ఇసుకకు అక్కడి ఏజెంట్ల ద్వారా కనీసం రూ.10నుంచి రూ.20వేల కమీషన్ అందుతుండడమేనన్న ఆరోపణలున్నాయి. నేతల పేరు చెప్పి వాహనాలు
ముందుకువెళ్తుంటే అధికారులూ
మిన్నకుండిపోవాల్సివస్తోంది. గతంలో అధికారులు నిఘా వేసి వాహనాల్ని పట్టుకున్నా టీడీపీ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వదిలేయాల్సిన పరిస్థితి. ఇసుక అక్రమ మార్గం లో వెళ్తోందని టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్‌లు వస్తున్నా అది ఏ పార్టీకి చెందిన వారిదంటూ అధికారులు అడుగుతుండడంపై మాజీ మంత్రి ధర్మాన కూడా ఇటీవల కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. టీడీపీ నేతల ఇసుకకు అధికారులు రైట్‌రైట్ అంటున్నారని ఆయన బహిరంగ విమర్శలు చేయడం గమనార్హం. ఇకనైనా జిల్లా వాసుల అవసరాలు తీరిన తరువాత పొరుగు జిల్లాకు ఇసుక తరలించాలని అంతా కోరుతున్నారు.