వెయ్యి కోట్లు... వెనకేశారు! | Sand Mafia In Srikakulam | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్లు... వెనకేశారు!

Published Thu, Apr 4 2019 11:25 AM | Last Updated on Thu, Apr 4 2019 11:29 AM

Sand Mafia In Srikakulam - Sakshi

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తమ్మినాయుడుపేట వద్ద జాతీయ రహదారి వంతెనకు సమీపంలో ఇసుక తవ్వకాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదుల జిల్లాగా పేరొందిన సిక్కోలులో ఐదు నుంచి పది ర్యాంపులకు మాత్రమే పర్యావరణ అనుమతులతోపాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్‌ కమిటీ నుంచి అనుమతులు ఉన్నాయి. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయిన్లతో ఛిద్రం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్‌లైన్‌లో చలానా చెల్లించి, రసీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్‌ చేసేవారు.

ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలు కాలేదు. సరికదా మరోవైపు ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవననిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే.

నేరుగా జేబుల్లోకి మళ్లించేందుకే...
టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016 ఏప్రిల్‌ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవరైనా దాన్నో వ్యాపారంగా మార్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్నివిధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్‌ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

విశాఖకు తరలించి అక్రమ సంపాదన...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్‌ వద్ద రూ.100కు మించకుండా సీనరైజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్‌లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. 

జేబులు నింపుకోవడానికి... 
టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్‌ ఆర్డర్‌ స్ట్రీమ్‌ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా సాండ్‌ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. కానీ అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగిస్తోంది.
♦ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. 
♦ వంతెనలకు, ఇరిగేషన్‌ పంపులు, వాటర్‌ ఫిల్టర్‌ సంపులకు కనీసం 500 మీటర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కా నీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు.
నిబంధనల ప్రకారం రీచ్‌ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు.
♦ ముఖ్యంగా ఇసుక రీచ్‌ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నదిలో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. 
♦ ఇసుక డిమాండును బట్టి రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది.

బాహాటంగానే సంబంధాలు...
ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న నాగావళి, వంశధార నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ బంధువులు, అనుచరగణం పాత్రపై అనేక విమర్శలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడి అనుచరులు ఉన్నారు. కల్లేపల్లి, భైరి ర్యాంపుల్లో మాఫియాతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచర గణానికి భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరుల వసూళ్లు భారీగానే సాగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో మాతల వద్ద ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాత్ర ఏమిటో బహిరంగ రహస్యమే. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నాయకుల మధ్యే కోల్డ్‌వార్‌ సాగిన సంగతీ తెలిసిందే! 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు

2
2/4

శ్రీకాకుళం నగరానికి ఆనుకొని నాగావళి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు

3
3/4

పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోకే రాకపోకలు సాగించిన లారీలు (ఫైల్‌)

4
4/4

సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం బారులు తీరిన లారీలు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement