సంగమేశ్వరం (పొన్నలూరు), న్యూస్‌లైన్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి. మండలంలోని చెన్నిపాడు సమీపాన పాలేరు-మాకేరు నదులపై 2007లో * 50.50 కోట్లతో ప్రాజెక్టును నిర్మించేందుకు వీ ప్రభాకర్‌రెడ్డి కోరమాండల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు దక్కించుకుంది. పాలేరు-మాకేరు నదుల సంగ మం వద్ద స్పిల్‌వే నిర్మించడం ద్వారా సుమారు 0.586 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు నుంచి కుడి కాలువ ద్వారా పొన్నలూరు మండలంలో 3,500 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా జరుగుమల్లి మండలంలో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళికలు తయారు చేశారు.
ఇప్పటి వరకు జరిగిన పనులివీ..
ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. కాంట్రాక్టు సంస్థ ఇప్పటి వరకు నేరుగా పనులు చేపట్టలేదు. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఇన్నయ్య, గిద్దలూరుకు చెందిన రాజశేఖర్‌లు కొంత కాలం ప్రాజెక్టు పనులు చేశారు. వివిధ కారణాలతో పనులు చాలా కాలం ఆగిపోయాయి. చివరకు గత డిసెంబర్ 17న స్థానిక ఎమ్మెల్యే జీవీ శేషు చొరవ తీసుకొని ప్రాజెక్టు పనులను పునఃప్రారంభింపజేశారు. ఈసారి హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్రాజెక్ట్స్ సంస్థ మట్టి కట్ట పనులు చేయడానికి ముందుకొచ్చింది. గత పది నెలల కాలంలో నదికిరువైపులా ఒక కిలోమీటరు పొడవునా మట్టి కట్ట పనులు మినహా మరేమీ చేయలేదు.
వర్షాల వలన ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు మైత్రి ప్రాజెక్ట్స్ ప్రతినిధులు తెలిపారు. గత నెల రోజులుగా మాత్రమే మండలంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండగా రెండు నెలలుగా పనులు ఆపాల్సిన అవసరం ఏమిటో కాంట్రాక్టరే చెప్పాల్సి ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. అంటే మరో రెండు నెలలు మాత్రమే గడువుంది.
ప్రాజెక్టు పూర్తయ్యేనా...
జలయజ్ఞంలో భాగంగా మండలానికి సంగమేశ్వరం ప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు వలన పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో 9500 ఎకరాలకు సాగునీరు, 30 వేల మందికి తాగునీరు అందించవచ్చు. రెండు మండలాలకు వరప్రసాదిని అయిన ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి సాగుతున్నా అటు అధికారుల్లో గానీ, ఇటు ప్రజాప్రతినిధుల్లో గానీ చలనం లేదు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులు ఇప్పటి వరకు మొదలు కానేలేదు. స్పిల్‌వే పనుల కోసం అప్పట్లో ఆర్థిక శాఖామాత్యునిగా ఉన్న కొణిజేటి రోశయ్య శిలాఫలకం వేశారు. అయినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
పనులు నిలిచింది వాస్తవమే..
ఇరిగేషన్ డీఈ రత్నరాజు
ప్రాజెక్టు పనులు నిలిచిన మాట వాస్తవమే. కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెద్దగా పెండింగ్‌లో లేవు. కాంట్రాక్టర్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.
రెండు నెలలుగా ఆగిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు
Published Mon, Aug 26 2013 5:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement