గేట్‌నుంచి నీటి లీకేజీ, డ్యాం స్పిల్‌వే
సాక్షి, నాగార్జునసాగర్: బహుళార్థసాదక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. జలాశయం నిండుగా ఉండడంతో క్రస్టు గేట్ల ద్వారా నీరు పెద్ద ఎత్తున లీకేజీ అవుతోంది. లీకేజీ కాకుండా ప్రతి ఏటా వేసవిలో క్రస్ట్ గేట్లకు రబ్బరు సీళ్లు ఏర్పాటు చేయడంతో పాటు గేట్లు ఎత్తే ఇనుప తాడుకు గ్రీజింగ్ చేస్తారు. ఈఏడాది కూడా కొంత మేరకు రబ్బరు సీళ్లును అమర్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.అయినప్పటికీ రబ్బరు సీళ్లు అమర్చిన ప్రాంతం నుంచి కూడా నీటి లీకేజీ జరుగుతోంది. ప్రస్తుతం జలాశయంంలో 586.60 అడుగుల నీటిమట్టం ఉంది. గాలులు వీస్తుండటంతో జలాశయంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సయయంలో క్రస్టు గేట్లనుంచి నీరు లీకవుతుంది.
సిబ్బంది కొరత, కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత
డ్యాంపై గతంలో 100మంది ఉద్యోగులు పనిచేసేవారు. నేడు పదుల సంఖ్యలోకి సిబ్బంది తగ్గారు. దీంతో పనులన్నీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించపోవడంతో కూడా సమస్యలకు కారణమని తెలుస్తోంది. క్రస్టు గేట్లకు రబ్బరు సీళ్ల అమరిక సరిగా లేక నీరు కారుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. నీటి లీకేజీ స్వల్పంగా ఉన్న సమయంలోనే పుట్టీల్లో గత ఈతగాళ్లను గేట్ల వద్దకు పంపి జనప, గోగునార, పీచు ఏర్పాటు చేయించేవారు. కానీ, ఈఏడాది ఒకేసారి వరద విపరీతంగా రావడంతో అలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేకుండాపోయింది. నీరు తగ్గుముఖం పడితే కానీ క్రస్టు గేట్లనుంచి నీటి లేకేజీల నివారణకు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ప్రాజెక్టు సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment