
పల్లె గూటికి పండగొచ్చింది
Published Mon, Jan 13 2014 4:36 AM | Last Updated on Fri, Jul 6 2018 3:37 PM
సాక్షి, ఏలూరు/తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : సంక్రాంతి అంటేనే పల్లె పండగ. ప్రతి ఇల్లు నిండుగా పిల్లాపాపల సందడితో కళకళలాడుతున్నాయి. కొత్త దుస్తుల్లో మురిసిపోతున్న చిన్నారులు.. ముంగిళ్లలో ముగ్గులు.. వీధుల్లో భోగి మంటలు.. హరిదాసుల సందడి.. డూడూ బసవన్నల విన్యాసాలు.. పిండి వంటల ఘుమఘుమలు కనిపిస్తున్నాయి. వీటన్నికంటే ముఖ్యంగా పొట్టకూటికోసం చెల్లాచెదురైన వారి రాకతో పల్లెలన్నీ ఉత్సాహాన్ని నింపుకున్నాయి. ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కళకళలాడుతోంది. ఎంత ఎదిగినా పల్లె ఒడిలో ఏడాదికోసారైనా ఒదగనిదే కొందరికి సంతృప్తి ఉండదు. తాతలతో ఆటలు ఆడుకోవాలి.. చిరుప్రాయంలో తాము చేసిన చిలిపి పనులను తెలుసుకొని మళ్లీ ఒక్కసారి బాల్యంలో విహరించాలి.. వయసులు మరచి ఆటలాడాలి.. పాటలు పాడాలి..అల్లరి చేయాలి.. కుటుంబ సభ్యులతో పండగను చేసుకొని పరవశించాలని పలువురు పల్లె తల్లి చెంతకు చేరారు. బస్సులు.. రైళ్లు.. విమానాలు ఎక్కి రెక్కలు కట్టుకుని పల్లె ముంగిట వాలిపోతున్నారు. చేల గట్లు, పచ్చని చెట్లు వీరికి ఆవాసాలుగా మారుతున్నాయి. అలసిపోయిన జీవులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా పల్లెల్లో పరిస్థితులపై ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరికించింది. ఊరూవాడా సంక్రాంతి సందడే కనిపిస్తోంది.

ఆనందం అంతాఇంతా కాదు
సంక్రాంతి సెలవులు ఎంజాయ్ చేసేందుకు పల్లెల్లోని పచ్చని పొలాలే బాగుంటాయని మీనాక్షి, సింధూజ, శ్రీదేవి అన్నారు. అలంపురంలో భవ్య, శృతి వారి స్నేహితులతో సంప్రదాయ దుస్తులతో చేలగట్లపై సందడి చేశారు. పల్లెటూళ్లంటే తమకెంతో ఇష్టమని, ఎన్ని పనులున్నా మానుకుని సంక్రాంతికి ఇక్కడకు వస్తుంటామని వారు అన్నారు. తాతయ్య, అమ్మమ్మ, బంధువుల మధ్య పండగ చేసుకోవడం తమకెంతో ఆనందాన్నిస్తుందని చెప్పారు.
పండగొచ్చింది.. సందడి తెచ్చింది
తాడేపల్లిగూడెం : సింగపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తీరిక లేకుండా గడిపే కుటుంబాలు ఆడి, పాడి సందడి చేశాయి. అన్నీ మరచి మది నిండుగా సంతోషంతో గడిపాయి. తాడేపల్లిగూడెం మండలం ఇటుకులగుంటలోని సుందరారాజుతోటలో 15 కుటుంబాల సభ్యులు ఆదివారం ఆట, పాటలతో గడిపారు. ఆప్యాయతలు, అనురాగాల పలకరింపులతో తోటలు, పొలాల్లో విహరించారు. అదేగ్రామానికి చెందిన రుద్రరాజు వరప్రసాదరాజు, స్వరూపరాణి బంధువులు మూడేళ్లుగా ఇలా సంక్రాంతి పండగకి ఒక్కచోట కలిసి సందడి చేస్తున్నారు. మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని, హౌసీలు ఆడి ఉత్సాహానిచ్చారు. మెట్ట ఉప్పరగూడెంలో సోదరీమణులకు మోటారు సైకిళ్ల డ్రైవింగ్ నేర్పుతూ అన్నలు.. భోగి మంటలు వేసి అన్నలు సంబరపడ్డారు. వనంలో స్వేచ్ఛా విహంగాల మాదిరి కలియతిరుగుతూ సంక్రాంతి సంబరాన్ని కళ్లముందుంచారు.
సంబరాలే భళా
సంక్రాంతి సందర్భంగా జిల్లాలో వంటల పోటీలు, ముగ్గుల పోటీలే కాక పతంగుల (గాలిపటాలు) పోటీలు జోరుగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, మహిళా సంఘాలు, క్లబ్‌ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులలో తెలుగు సంస్కృతి బీజాలు నాటేందుకు విద్యాసంస్థల్లో సంబరాలు చేస్తున్నారు.
సున్నుండ.. పోకుండ.. జంతికలు.. అరిసెలు
పెరవలి : సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకం. ఘుమఘుమలాడే సున్నుండలు, జంతికలు, అరిసెలు, పోకుండలు, పూతరేకులు వంటి వంటలతో బంధువులను ఆనందింపజేయడం పరిపాటే. ధనికా, బీద తేడా లేకుండా ప్రతిఇంటా ఏదో ఓ రకం పిండి వంట తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మినప సున్నుండలను ప్రతిఇంటా చేస్తున్నారు. గారెలు.. బూరెల సంగతి సరేసరి.
ఏటా వస్తాం
అలంపురానికి చెందిన ప్రవాస భారతీయులు పొత్తూరి సురేష్‌కుమార్ రాజు, కనుమూరి సతీష్‌వర్మ పండగకు పిల్లలతో సొంతూరు వచ్చారు. వారి పిల్లలు వర్షిత్, కావ్య, తేజస్వీ, ప్రణవ్ కోతికొమ్మచ్చి ఆటలు ఆడి సందడి చేశారు. పల్లెటూళ్లలోనే సంక్రాంతి కళ కనిపిస్తోంది. ఎన్ని పనులున్నా ప్రతిఏటా పెద్ద పండగకి సొంతూరు వచ్చేస్తామని వారు అన్నారు.
Advertisement
Advertisement