
సాక్షి. విజయవాడ: జిల్లాలోని అంపాపురంలో యార్లగడ్డ యూత్ ఆధ్వర్యంలో మన ఊరు-మన సంక్రాంతి పేరుతో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్యాలు, కోలాటాలు, ముగ్గుల పోటీలతో పాటు గ్రామీణ క్రీడలు, గుర్రపు బండ్ల స్వారీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా యజమాని పరువు నిలిపేందుకు కదనరంగంలో కాలుదువ్విన కోడిపందాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అనంతరం పోటీలో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ సాంప్రదాయ సక్రాంతి పండుగ సంబరాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు.
కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కనులపండుగగా జరిగాయి. పౌరుషానికి ప్రతీకగా సాగిన కోడిపందాలు ఆకర్షణగా నిలిచాయి. కోడిపందాలను తిలకించేందుకు మహిళలు ఎంతో ఆసక్తిని కనబరచగా.. వివిధ జిల్లాల నుంచి పందెం ప్రియులు తరలివచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన కాక్ ఫైట్‌ను తిలకించడానికి రైతులు ఉత్సాహాన్ని చూపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనడంతో సంక్రాంతి సంబరాలకు కొత్త కళ వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి: జిల్లాలోని అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, గన్నవరం నియోజకవర్గంలో కోడింపందాలు, గుండాటలు జోరు సాగాయి. ఈ క్రమంలో కోడిపందాళ్లలో పోలీసుల ఆంక్షల్ని పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు.