వైఎస్సార్‌సీపీ అభిమాన అధికారులూ వెళ్లిపోండి
సత్యవేడు: వైఎస్‌ఆర్ సీపీపై అభిమానం ఉన్న అధికారులు, సిబ్బంది మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పే పనులతో పాటు సర్పంచ్‌లకు పనులు చేయని అధికారులు తన నియోజకవర్గంలో అవసరం లేదన్నారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
ఎమ్మెల్యే ఆదిత్య మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతి నిధుల తీర్మానం ఉన్నా, లేకున్నా, గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు మెజారిటీ జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో చేయాలని మండల అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌ను కారణంగా చూపించి పనులు ఆపేయించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు. తమిళనాడుకు ఇసుక అక్రమంగా రవాణా చేయవద్దని ఆయన టీడీపీ నాయకులను కోరారు.