రఘును రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి/గన్నవరం/విజయవాడ లీగల్/పెదవాల్తేరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీలు నల్లూరి వెంకటశివ ప్రసాద్, గాయత్రీ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు మంగళవారం కొనసాగాయి. రెండో రోజు మంగళవారం జరిపిన సోదాల్లో వేర్వేరు బ్యాంకుల్లో రఘు పేరున రూ.60 లక్షల నగదు ఉన్నట్టు తేలింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.17 లక్షల విలువైన ఇంటి స్థలం, చిత్తూరు జిల్లా సత్యవేడులో రూ.24 లక్షల విలువైన స్థలం ఉన్నట్టు డాక్యుమెంట్లు దొరికాయి. అలాగే రఘుకు బినామీగా ఉన్న శివప్రసాద్ భార్య గాయత్రీ పేరు మీద గన్నవరంలోని భార్గవి నగర్‌లో రూ.80 లక్షల విలువైన డూప్లెక్స్ ఇల్లు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి.
భార్గవి నగర్‌లోనే అత్యంత విశాల మైన ప్రదేశంలో రఘు తన పేరు మీద ఓ వాటికను నిర్మించినట్లు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. అంతేకాకుండా రఘు, శివప్రసాద్, గాయత్రీ పేరుతో రావుఫీన్ రియల్ ఎస్టేట్ ప్రాంగణంలో 1.5 ఎకరాల్లో నిర్మిస్తున్న కళ్యాణ మండపం, రెండు బహుళ అంతస్తుల భవనాలు, సప్త రుషివనం, ఒక అపార్ట్‌మెంట్, మరో భవనం, సాయి బాబా మందిర భవనంతో పాటు మరి కొన్ని ప్లాట్లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. కాగా, సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెండి సామగ్రి, స్థిరాస్తి పత్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. శివప్రసాద్, గాయత్రీతో పాటు బినామీలు ఇంకా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రఘుతో పాటు శివప్రసాద్, గాయత్రీని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.