విశాఖ వన్డే మ్యాచ్‌ను అడ్డుకుంటాం
కాకినాడ, న్యూస్‌లైన్: విశాఖలో ఈనెల 24న జరిగే భారత్-వెస్టిండీస్ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకోవాలని, తద్వారా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రుల మనోగతాన్ని అంతర్జాతీయ స్థాయిలో చెప్పాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. రాష్ర్ట విభజనపై కేంద్రం ముందుకెళుతున్న తరుణంలో తాము చేస్తున్న నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాస్మో పాలిటన్ క్లబ్‌లో శనివారం జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి 23 మంది ప్రతినిధులు హాజరై విభజన పరిణామాలను చర్చించారు.
సీమాంధ్రలోని 132 బార్ అసోసియేషన్లలో అత్యధిక సంఘాల తీర్మానానికి అనుగుణంగా ఉద్యమాన్ని కొనసాగించేందుకే స్టీరింగ్ కమిటీ కన్వీనర్లు మొగ్గుచూపారు. ఇప్పటికే విధులు బహిష్కరించి 100 రోజులు పూర్తయినప్పటికీ ఇదే ఉద్యమ పంథా కొనసాగించాలని నిర్ణయించారు. ఈనెల 23 వరకు విధులు బహిష్కరించడంతో పాటు వినూత్న రీతిలో ఆందోళనలు నిర్విహ ంచేలా కార్యాచరణ రూపొం దించారు. జేఏసీ రాష్ర్ట కన్వీనర్ ఎం.జయకర్ తెలిపిన వివరాల ప్రకారం..
11న అన్ని కోర్టుల్లోని బార్ అసోసియేషన్లలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తారు.
12, 13 తేదీల్లో గ్రామాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
15న చలో విజయవాడ నిర్వహించి రైలురోకో చేస్తారు.
16,17 తేదీల్లో రాష్ర్ట విభజన-రాజ్యాంగపరమైన ఇబ్బందులపై హైదరాబాద్‌లో చర్చాగోష్ఠి జరుగుతుంది.
18న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తారు.
19న నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించి విభజన వల్ల కలిగే నష్టాలపై చర్చలు నిర్వహిస్తారు.
20న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తారు.
21న ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన తెలుపుతారు.
22న సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు.
24న తిరిగి కడపలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.
అదేరోజు విశాఖపట్నంలో జరిగే భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌ను సమైక్యవాదులతో కలిసి అడ్డుకుంటారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డీవీ సుబ్బారావును కలిసి విశాఖ మ్యాచ్ రద్దు చేయమని కోరాలని తీర్మానించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో- కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, కో- ఆర్డినేటర్ వి.శ్రీనివాసరెడ్డి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎ.రామిరెడ్డి, కౌన్సిల్ సభ్యుడు బొగ్గవరపు గోకులకృష్ణ తదితరులు పాల్గొన్నారు.