Seemandhra JAC
-
'అండగా ఉంటామనటం ఫ్యాషన్ అయిపోయింది'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రకు కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్, బేజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీమాంధ్రులకు అండగా ఉంటామంటూ తెలంగాణ నేతలు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని జేఏసీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
'చిరంజీవికి నియోజకవర్గాలు కూడా తెలియదు'
హైదరాబాద్: కేంద్రంలో మంత్రి స్థానంలో ఉన్న చిరంజీవికి రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తెలియదని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ విమర్శించింది. ఏపీఎన్జీవోలు రాజీనామాలు చేయాలని చిరంజీవి డిమాండ్ చేసిన నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు మండిపడ్డారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజునే లక్ష మందితో ముట్టడిస్తామని ఉద్యోగ సంఘ జేఏసీ హెచ్చరించింది. డిసెంబర్ 9వ తేదీని విద్రోహదినంగా ప్రకటిస్తామని తెలిపింది. చిరంజీవి రాజీనామా చేసిన మరుక్షణమే తాను కూడా రాజీనామా చేస్తానని అశోక్ బాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన మరుక్షణమే విభజన ఆగిపోతుందని సీమాంధ్ర ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
'విశాఖ వన్డేను రద్దు చేయాలి'
భారత్, వెస్టిండీస్‌ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న విశాఖపట్నంలో భారత్, విండీస్ మ్యాచ్ జరగాల్సివుంది. కోట్లాది ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానించినట్టు కన్వీనర్ ముప్పాల సుబ్బారావు చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కోట్లాదిమంది సమైక్యవాదులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో విశాఖలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సరికాదని సుబ్బారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ నెల 23 వరకు విధుల్ని బహష్కరించారు. -
విశాఖ వన్డే మ్యాచ్‌ను అడ్డుకుంటాం
కాకినాడ, న్యూస్‌లైన్: విశాఖలో ఈనెల 24న జరిగే భారత్-వెస్టిండీస్ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకోవాలని, తద్వారా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రుల మనోగతాన్ని అంతర్జాతీయ స్థాయిలో చెప్పాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. రాష్ర్ట విభజనపై కేంద్రం ముందుకెళుతున్న తరుణంలో తాము చేస్తున్న నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాస్మో పాలిటన్ క్లబ్లో శనివారం జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి 23 మంది ప్రతినిధులు హాజరై విభజన పరిణామాలను చర్చించారు. సీమాంధ్రలోని 132 బార్ అసోసియేషన్లలో అత్యధిక సంఘాల తీర్మానానికి అనుగుణంగా ఉద్యమాన్ని కొనసాగించేందుకే స్టీరింగ్ కమిటీ కన్వీనర్లు మొగ్గుచూపారు. ఇప్పటికే విధులు బహిష్కరించి 100 రోజులు పూర్తయినప్పటికీ ఇదే ఉద్యమ పంథా కొనసాగించాలని నిర్ణయించారు. ఈనెల 23 వరకు విధులు బహిష్కరించడంతో పాటు వినూత్న రీతిలో ఆందోళనలు నిర్విహ ంచేలా కార్యాచరణ రూపొం దించారు. జేఏసీ రాష్ర్ట కన్వీనర్ ఎం.జయకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 11న అన్ని కోర్టుల్లోని బార్ అసోసియేషన్లలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తారు. 12, 13 తేదీల్లో గ్రామాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 15న చలో విజయవాడ నిర్వహించి రైలురోకో చేస్తారు. 16,17 తేదీల్లో రాష్ర్ట విభజన-రాజ్యాంగపరమైన ఇబ్బందులపై హైదరాబాద్‌లో చర్చాగోష్ఠి జరుగుతుంది. 18న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తారు. 19న నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించి విభజన వల్ల కలిగే నష్టాలపై చర్చలు నిర్వహిస్తారు. 20న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తారు. 21న ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన తెలుపుతారు. 22న సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. 24న తిరిగి కడపలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. అదేరోజు విశాఖపట్నంలో జరిగే భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌ను సమైక్యవాదులతో కలిసి అడ్డుకుంటారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డీవీ సుబ్బారావును కలిసి విశాఖ మ్యాచ్ రద్దు చేయమని కోరాలని తీర్మానించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో- కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, కో- ఆర్డినేటర్ వి.శ్రీనివాసరెడ్డి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎ.రామిరెడ్డి, కౌన్సిల్ సభ్యుడు బొగ్గవరపు గోకులకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం'
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వంద రోజుల నుంచి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానం చేసింది. ఈ నెల 23 వరకు విధుల్ని బహిష్కరించాలని ఆందోళన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారులను దిగ్భంధించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఇటీవల సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. -
సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సీఎం కిరణ్
ఇల్లెందు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీ చైర్మన్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులపై దాడి అమానుషమని పేర్కొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. స్థానిక జగ దాంబసెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు యాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఏపీఎన్జీవోస్కు సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చి తెలంగాణ శాంతిర్యాలీకి అనుమతిని నిరాకరించడం దారుణమన్నారు. అక్రమాస్తులు కలిగివున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేశ్కుమార్రెడ్డికి ఒక్క రోజు కూడా ఆ బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు సాగిస్తున్న కుట్రల వెనుక సీఎం, డీజీపీల హస్తం ఉందని ఆరోపించారు. నిజాం కళాశాల విద్యార్థులపై దాడి చేయించడమే కాకుండా దెబ్బలు తగిలిన వారికి వైద్యం చేయించడంలోనూ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం తెలంగాణ బంద్ విషయంలో ఒక తీరు...ఏపీఎన్జీవోల సభ విషయంలో మరో తీరుగా వ్యవహరించడం సరికాదని టీజేఏసీ డివిజన్ చైర్మన్ పి.అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జాన్పాషా, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, సిలివేరు సత్యనారాయణ పాల్గొన్నారు. -
అనంతలో సామూహిక సెలవు ప్రకటించిన జాక్టో
అనంతపురం : అనంతపురం జిల్లావ్యాప్తంగా 13వ రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం జాక్టో సోమవారం సామూహిక సెలవు ప్రకటించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. పీటీసీ నుంచి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాగా వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామాలకు సంఘీభావంగా అనంతపురం జిల్లలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. ధర్మవరంలో 3వేలమందితో రెండ్ల సంఘం సమైక్యా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై వంటావార్పు చేస్తున్నారు. కాగా ధర్మవరం తారకరామాపురానికి చెందిన ఆకుల టివిలో విభజన వార్తలు చూసి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిగా, గుంతకల్లులో ఆందోళనలో పాల్గొన్న రహమాన్ అనే వ్యక్తి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెహమాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు రోడ్డెక్కలేదు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంతో జిల్లా హోరెత్తుతోంది. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే టీడీపీ సోమవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.