అనంతలో సామూహిక సెలవు ప్రకటించిన జాక్టో
అనంతపురం : అనంతపురం జిల్లావ్యాప్తంగా 13వ రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం జాక్టో సోమవారం సామూహిక సెలవు ప్రకటించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. పీటీసీ నుంచి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాగా వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామాలకు సంఘీభావంగా అనంతపురం జిల్లలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. ధర్మవరంలో 3వేలమందితో రెండ్ల సంఘం సమైక్యా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై వంటావార్పు చేస్తున్నారు.
కాగా ధర్మవరం తారకరామాపురానికి చెందిన ఆకుల టివిలో విభజన వార్తలు చూసి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిగా, గుంతకల్లులో ఆందోళనలో పాల్గొన్న రహమాన్ అనే వ్యక్తి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెహమాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు రోడ్డెక్కలేదు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంతో జిల్లా హోరెత్తుతోంది. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే టీడీపీ సోమవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.